కారులో కాస్త..  సౌండ్‌ పెరిగింది.. నెక్స్ట్‌ ఏంటి? | More TRS Leaders Express Dissatisfaction On Party Supremacy | Sakshi
Sakshi News home page

కారులో కాస్త..  సౌండ్‌ పెరిగింది.. నెక్స్ట్‌ ఏంటి?

Published Thu, Mar 17 2022 4:50 AM | Last Updated on Thu, Mar 17 2022 10:53 AM

More TRS Leaders Express Dissatisfaction On Party Supremacy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘గులాబీ తోట’లో అసంతృప్తి పెరుగుతోందా? పార్టీ అధిష్టానం తమను పట్టిం చుకోవడం లేదని నేతలు భావిస్తున్నారా? టికెట్‌ రాకపోయినా ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనతో ఉన్నారా? నాయకత్వంతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా?.. ఈ అంశాలపై అధికార టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పార్టీ అవిర్భావం నుంచి మొదలుకుని నిన్నా మొన్నటి దాకా వివిధ పార్టీల నుంచి చేరికలతో ఓవర్‌ లోడ్‌ అయిన ‘కారు’లో అసంతృప్తి స్వరం విన్పిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా.. 
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికలు వస్తే తమకు టికెట్‌ దక్కే అవకాశాలను ఇప్పటి నుంచే బేరీజు వేసుకుంటున్న నేతలు టికెట్‌ సాధన దిశగా ముందస్తు జాగ్రతలు తీసుకుంటున్నారు. పార్టీలోని తమ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాల్లో ఇది ముదిరిపాకాన పడుతోంది. అటు మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూపల్లి కృష్ణారావు విషయం హాట్‌టాపిక్‌గా మారుతోంది.

119 మంది సభ్యులున్న అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం తో టీఆర్‌ఎస్‌ తిరుగులేని పార్టీగా ఉంది. అయితే  సగం నియోజకవర్గాల్లో బలమైన బహుముఖ నాయకత్వం ఉండటం సమస్యగా మారి నేతల్లో అసంతృప్తికి తావిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడంతో పాటు సొంత పార్టీ్టలో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కొందరు నేతలు పార్టీ టికెట్‌ వచ్చినా రాకున్నా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో.. తమదైన శైలిలో నియోజకవర్గ స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో తమకు లాభిస్తుందని విపక్ష పార్టీలు ఆశిస్తుండగా, అసంతృప్తి అంశాన్ని టీఆర్‌ఎస్‌ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. 

చర్చనీయాంశమైన ముగ్గురి భేటీ 
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలి కాలంలో వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నెల 8న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వనపర్తి జిల్లాలో పర్యటించగా, జూపల్లి అదే రోజు తుమ్మల, పొంగులేటితో భేటీ కావడం చర్చనీయాంశమైంది.

తాను ఆయిల్‌పామ్‌ సాగు తీరును పరిశీలించేందుకే ఖమ్మం వెళ్లినట్లు జూపల్లి చెప్పినా, ఆ తర్వాత కొల్లాపూర్‌లో తన అనుచరులతో జూపల్లి భేటీ అయ్యారు. కొల్లాపూర్‌ శివారులోని ఓ తోటలో జరిగిన సమావేశంలో బీజేపీలోకి వెళ్లడం కంటే కాంగ్రెస్‌లోకి వెళ్లడమే బెటర్‌ అని అనుచరులు సూచించినట్టు సమాచారం. జూపల్లి మాత్రం తాను ఇప్పట్లో పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్తూనే భవిష్యత్‌ కార్యాచరణపై స్పష్టత ఇచ్చినట్లు, వచ్చే ఎన్నికల్లో పోటీ తప్పదని తేల్చి చెప్పినట్లు తెలిసింది.

అయితే కాంగ్రెస్‌ నుంచి గెలిచిన హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తనకు ప్రాధాన్యత తగ్గిందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పారు. అయితే పార్టీ అధిష్టానం తనను గుర్తించినా, లేకున్నా పోటీలో ఉండటం మాత్రం ఖాయమని ప్రకటించారు. వాస్తవానికి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకపోవడం పొంగులేటి అసంతృప్తికి కారణమయ్యింది.

ఈ నేపథ్యంలోనే ఈసారి పరిస్థితిని అంచనా వేస్తున్న ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటూ తన కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇక తుమ్మల కూడా పార్టీ వేదికల మీద పెద్దగా కనిపించడం లేదు. పైగా పార్టీకి ద్రోహం చేస్తున్న శత్రువులు పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమయ్యింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సీనియర్‌ నాయకుడినైన తనను అధిష్టానం పట్టించుకోవడం లేదని తుమ్మల భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఖమ్మం మాదిరిగానే ఇతర చోట్లా.. 
వరుసగా రెండు పర్యాయాలు 2014, 2018 అసెం బ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లకు గాను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కేవలం ఒక్కోస్థానంలో మాత్రమే గెలుపొందారు. 2014లో జలగం వెంకట్‌రావు, 2018లో పువ్వాడ అజయ్‌ మాత్రమే విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా ప్రతి చోటా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు.

సిట్టింగు ఎమ్మెల్యేలకే టికెట్‌ దక్కే పక్షంలో తమ దారి తాము చూసు కోవాలనే భావనలో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాగా మెదక్‌లో పద్మా దేవేందర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, తాండూరులో రోహిత్‌రెడ్డి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌.. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత మాలోత్, స్టేషన్‌ ఘనపూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..ఎమ్మె ల్సీ కడియం శ్రీహరి నడుమ పొలిటికల్‌ వార్‌ కొన సాగుతోంది. ఇక సంగారెడ్డిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారంతో స్థానిక కేడర్‌లో అయోమయం నెలకొంది. 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పెద్దపీటపై కినుక 
ఆర్నెల్ల వ్యవధిలో 21 మంది ఎమ్మెల్సీలు ఎన్నికైనా తమకు అవకాశం దక్కకపోవడం కొందరు నేతలను అసంతృప్తికి గురిచేసింది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో ఖాళీలున్నా అడపాదడపా మాత్ర మే నియామకాలు జరుగుతున్నాయి. ఖాళీలు కొనసాగుతున్నా తమకు అవకాశం ఇవ్వకపోవడం ఆశావహుల్లో నిస్పృహకు తావిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని గతేడాది అక్టోబర్‌లో జరిగిన ప్లీనరీ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించినా అది కార్యరూపం దాల్చడం లేదు.

పార్టీ పరంగా జిల్లా అధ్యక్ష పదవులు దక్కుతాయని భావించినా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే పెద్దపీట వేయడాన్ని ఆశావహులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవలి కాలంలో పార్టీలోనూ, పాల న పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న అధి నేత కేసీఆర్‌కు పార్టీ పరిణామాలపై పూర్తి అవగాహన ఉందని, అవసరమైన సందర్భాల్లో పార్టీని ఏకతాటిపైకి తేవడం కష్టసాధ్యమేమీ కాదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement