సాక్షి, హైదరాబాద్/ సాక్షి, యాదాద్రి: దళితుల సంక్షే మం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసించారు. దళితుల గుండెల్లో కేసీఆర్ అంబేడ్కర్ వారసుడిగా మిగిలిపోతారని కొనియాడారు. దళితబంధును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు, దళితులంతా కేసీఆర్‌కు అండగా నిలబడి హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్‌పై విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేసినట్లు మోత్కుపల్లి ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు తెలిపారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అవినీతిపరుడని తీవ్రంగా ఆరోపించారు.
ఎవరినైనా పార్టీలో చేర్చుకునే ముందు వారి క్రెడిబిలిటీ చూడాలని, ఈటలను బీజేపీ నెత్తిమీద మోయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. బీజేపీలో తనకు పని చేసే అవకాశం ఇవ్వలేదని తాను ఎప్పుడు వెళ్లినా కింద కూర్చునే పరిస్థితి ఉందని ఆరోపణలు చేశారు. పార్టీ తనను, తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దూరం పెట్టడం వల్లే బాధతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సంజయ్‌కు పంపిన లేఖలో మోత్కుపల్లి తెలిపారు. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత సమావేశానికి బండి సంజయ్‌కు తెలిపిన తర్వాతే వెళ్లినా కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం బాధాకరమని చెప్పారు. కాగా, మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరుతారని, త్వరలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన ముఖ్య అనుచరులు కూడా చెబుతున్నారు.
బీజేపీలో దళిత నేతలు ఇమడలేరు: పల్లా
పంజగుట్ట: బీజేపీ మనువాద సిద్ధాంత పార్టీ అని, అందులో మైనార్టీలు, క్రిస్టియన్లతో పాటు దళిత జాతి నేతలను ఏనాడూ ముందుకు రానివ్వరని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. దళిత జాతి ప్రజలను ఎప్పుడూ బీజేపీ పేదవారిగానే ఉంచేలా చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment