ఫైల్ ఫోటో
చీపురుపల్లి: మాన్సాస్ ట్రస్టు ముసుగులో ప్రజల ఆస్తులను దశాబ్దాల తరబడి అనుభవిస్తుండటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్న మాజీమంత్రి, టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు బహిరంగచర్చకు రావాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సవాల్ విసిరారు. చీపురుపల్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్టు ఆస్తుల రికార్డులతో అశోక్‌గజపతిరాజు ప్రజావేదికకు రావాలని, అక్రమాలపై పూర్తి ఆధారాలతో తాము వస్తామని చెప్పారు.
మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంవల్ల ప్రజలకు నష్టం జరగదని, అశోక్‌గజప తిరాజు అక్రమాలకు నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ట్రస్టు భూముల్ని విక్రయించడానికి, తాకట్టు పెట్టడానికి చట్టం అనుమతించకపోయినా.. నిబంధనల్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బ్రిటిష్ పరిపాలన అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి జమిందారీ, రాజ వ్యవస్థలకు భూములు వచ్చాయన్నారు. ఆ భూములు ప్రజలకే చెందాలన్న ఆశయంతో 1948లో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్, 1956లో టీనాం భూముల చట్టం ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు.
అయినప్పటికీ రాజ వంశీయుల వద్దే వేలాది ఎకరాల భూములు ఉండిపోవడంతో 1972లో ఇందిరా గాంధీ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు ప్రజలకు చెందాలని ఆదేశాలిచ్చారన్నారు. ఈ చట్టం ప్రకారం రాజ వంశీయులు 3 వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందన్నారు. అదే సమయంలో విజయనగరం రాజ వంశీయులు 8,850 ఎకరాల భూములు వారి వద్ద ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారని గుర్తుచేశారు. అందులో నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 3 వేల ఎకరాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఆ భూములు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే 1973లో మాన్సాస్ ట్రస్టును స్థాపించారని ఆరోపించారు. అయినప్పటికీ రాజవంశీయులు దురుద్దేశంతో మాన్సాస్‌కు చెందిన 38వ నంబర్ రికార్డును ట్యాంపరింగ్ చేసి, 43వ నంబర్ రికార్డు సృష్టించి మాన్సాస్ వద్ద 14,450 ఎకరాలు ఉన్నట్టుగా తప్పుదోవ పట్టించారన్నారు. మెడికల్ కళాశాల పేరుతో మాన్సాస్ ట్రస్టు నుంచి 200 ఎకరాలు విక్రయించారని, ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసమే ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్‌పై విచారణ నిర్వహిస్తోందని ఎంపీ బెల్లాన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment