MP Vijayasai Reddy On New Trend In Politics With The Appointment Of Consultants - Sakshi
Sakshi News home page

రాజకీయం.. సరికొత్త సమరం

Published Fri, May 19 2023 2:55 PM | Last Updated on Fri, May 19 2023 3:41 PM

MP Vijayasai Reddy On New Trend In Politics With The Appointment Of Consultants - Sakshi

ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించినా ఆ పార్టీకి సలహాదారులుగా పనిచేసినవారికి మీడియాలో కాస్త ఎక్కువ ప్రచారం ఈమధ్య లభిస్తోంది. ఫలితాలు వెలువడిన రెండు మూడు రోజులకు ఆయా పార్టీల వ్యూహకర్తల గురించి పత్రికలు, న్యూస్‌ వెబ్‌సైట్లలో, న్యూస్‌ టెలివిజన్‌ చానల్స్‌లో  కథనాలు వస్తున్నాయి. 

ఇలాంటి విషయాలు మీడియాలో వచ్చే ధోరణి భారతదేశంలో 2014 నుంచీ ఎక్కువైంది. నాటి ప్రధాని, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన 1984 డిసెంబర్‌ నెలాఖరు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ‘రీడిఫ్యూజన్‌’ అనే అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఏజెన్సీ సేవలను కాంగ్రెస్‌ పార్టీ  తొలిసారి వాడుకుంది. 

ఇంగ్లిష్‌ సహా వివిధ భాషల్లో వెలువడే దినపత్రికల్లో కాంగ్రెస్‌ తరఫున పూర్తి పేజీ ప్రచార ప్రకటనలను ఈ ఏజెన్సీ రూపొందించింది. ఈ ఎలెక్షన్‌ యాడ్స్‌ పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కమ్యూనికేషన్ల రంగంలో వృత్తి నైపుణ్యం గల ప్రైవేటు సంస్థలకు ఎన్నికల ప్రచారంలో కొంత బాధ్యతను రాజకీయ పక్షాలు అప్పగించడం 1980ల మధ్యలో దేశంలో ఓ మోస్తరుగా ఆరంభమైంది. 

1985 ఏప్రిల్‌ మాసంలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో కూడా నాటి జనతాపార్టీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే  ఒక కార్పొరేట్‌ యాడ్‌ ఏజెన్సీ ద్వారా పత్రికల్లో వేసిన ఎన్నికల ప్రచార ప్రకటనలు రూపొందింపజేశారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ 16వ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచి అక్కడ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లు సాధించడానికి వెనుక ఉన్న వృత్తి నిపుణులు, మాజీ ఐఏఎస్‌ అధికారుల గురించి మీడియాలో వివరాలు వెల్లడిస్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది లేదా ఆరు నెలల ముందు నుంచి ఈ వ్యూహకర్తలు అధికార పార్టీపై ఎలాంటి నినాదాలు రూపొందించారు? ఎలాంటి జన సమీకరణ కార్యక్రమాలు అమలు చేశారు? వంటి వివరాలను ఈ మీడియా సంస్థలు పలు వ్యాసాల్లో చెబుతున్నాయి. మొదట ఫలానా పార్టీ ఈ కారణాల వల్ల ఓడిపోయిందని, ఫలానా ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఏఏ కారణాల వల్ల విజయం సాధించిందనే అంశాలను మీడియాలో పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. 

వివిధ రాజకీయపక్షాల గెలుపోటములకు ఇలా కారణాలు వివరించాక, విజయాల వెనుక ఉన్న వ్యక్తులు, వృత్తి నిపుణుల గురించి రాయడం గత పదేళ్ల నుంచి దేశంలో ఆనవాయితీగా మారింది. 

పాశ్చాత్య దేశాల్లో కన్సల్టెంట్ల నియామకం
వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఓటర్లతో నేరుగా సంపర్కం సాధ్యం కాని అమెరికా, కెనడా, ఇంకా ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి ఐరోపా దేశాల్లో ఎన్నికల కన్సల్టెంట్లు లేదా వ్యూహకర్తల వినియోగం లేదా వారి సేవలు వాడుకోవడం 50 ఏళ్ల క్రితమే మొదలైంది. రాజకీయ పార్టీలకు సలహాదారులు, వ్యూహకర్తలగానే గాక, విడివిడిగా ఆయా పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారంలో ఈ వృత్తి నిపుణులు సేవలందిస్తున్నారు. 

(Photo Courtesy:BBC)

2008 నవంబర్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బరాక్‌ ఒబామా తనను గెలిపిస్తే దేశంలో గొప్ప మంచి మార్పు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అందుకోసం ‘ఛేంజ్‌ వీ కెన్‌ బిలీవ్‌ ఇన్‌’ అనే నినాదం రూపొందించి విస్తృత ప్రచారంలో పెట్టి అమెరికన్‌ ఓటర్ల మనసులు ఆకట్టుకున్నారు. 

సాధారణ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే ఇలాంటి నినాదాల రూపకల్పనలో ఈ కన్సల్టెంట్లు లేదా వ్యూహకర్తలు తోడ్పడతారు. ఇంతకు ముందు పాశ్చాత్య దేశాల్లో, ఇండియాలో ఆయా రాజకీయ పార్టీల నాయకుల్లో కొందరు ఇలాంటి జనాకర్షక నినాదాలు రూపొందించడంలో, తెలివైన ప్రచార వ్యూహాల రచనలో కీలక పాత్ర పోషించేవారు. ఎన్నికల్లో ప్రజలను కలుసుకోవడం, ఎన్నికల హామీలు, వాగ్దానాలు రూపొందించడం, ఇంకా ఇతర కార్యక్రమాల అమలుకే రాజకీయ పార్టీల నాయకుల సమయం సరిపోతోంది. 

రోజురోజుకు ప్రజలు లేదా ఓటర్ల ఆశలు, అవసరాలు పెరుగుతున్న కారణంగా ఎన్నికల రాజకీయాలు సంక్లిష్టమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయవేత్తలకు ఎన్నికల వ్యూహకర్తలు, సలహాదారుల అవసరం ఏర్పడుతోంది. రాజకీయపక్షాల సభ్యత్వం లేకుండానే ఈ ఎన్నికల నిపుణులు పనిచేయడం అమెరికా వంటి దేశాల్లో మొదలైంది. ఎన్నికల ప్రచారంలో ఒక తరహా శ్రమ విభజనకు ఈ ఎలక్షన్‌ కన్సల్టెంట్లు, వ్యూహకర్తల నియామకం అవకాశమిస్తోంది.


-విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement