సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం సోనియా అధ్యక్షతన వర్చువల్‌గా ఈ సమావేశం జరిగింది. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఐక్యంగా పోరాడటమే లక్ష్యం ప్రతిపక్ష పార్టీల భేటీ జరిగింది. స్వాతంత్ర్యోద్యమ విలువలు, రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలను విశ్వసించే ప్రభుత్వాన్ని అందించాలనే ఏకైక ఉద్దేశ్యంతో పోరాడాలని సోనియా పిలుపు నిచ్చారు.
2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ఐక్యంగా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సోనియా ప్రతిపక్ష పార్టీలను కోరారు. మనందరికీ ఎవరి సిద్దాంతాలు వారికి ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి దేశ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇదొక చాలెంజ్. ఐకమత్యాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. 2024 ఎన్నికలే అంతిమ లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పోరాడాలని సోనియా సూచించారు.
సమాఖ్య వ్యవస్థను, రాజ్యాంగ సంస్థలను దెబ్బతీస్తున్నారంటూ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తిన ఆమె పరిమితులు, ప్రతి బంధకాలను అధిగమించి ఐక్యంగా పోరాడాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఐక్యతను చాటినట్టుగానే పార్లమెంటు బయట కూడా అదే స్థాయిలో పోరాడాలన్నారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల ప్రభుత్వం వ్యాక్సినేషన్ పాలసీని మార్చుకుందన్న సోనియా మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఇటీవలే విపక్షాలతో సమావేశమైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పీడ్ పెంచడంతో తాజాగా సోనియా విపక్షాలతో భేటి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment