పణజి: హంగ్ అసెంబ్లీ ఏర్పడనుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో గోవాలో రాజకీయ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముందు జాగ్రత్తగా, కాంగ్రెస్ తన అభ్యర్థులందరినీ రిసార్టులో క్యాంప్ వేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేపీకి చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్టీ సీనియర్ నేతలంతా గోవా ఎన్నికల ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ పూర్తవ్వగా, ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ముందు జాగ్రత్తలో కాంగ్రెస్
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఓ కన్నేసి ఉంచేందుకు సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు పి.చిదంబరం, రాష్ట్ర ఇన్‌చార్జి దినేశ్ గుండూరావు ఆదివారం నుంచి గోవాలోనే ఉన్నారు. గెలిచేందుకు అవకాశాలున్న ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో వీరు టచ్‌లో ఉన్నారు. ‘కాంగ్రెస్ సభ్యులంతా బుధవారం ఉత్తరగోవాలోని ఓ రిసార్టులో ఉంటారు. అక్కడి నుంచి వారు కౌంటింగ్ కేంద్రాలున్న పణజి, మార్గావ్‌లకు వెళతారు. ఫలితాల అనంతరం గెలిచిన వారు పార్టీ కార్యాలయానికి తిరిగి రావాల్సి ఉంటుంది’అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
ఢిల్లీలో ప్రమోద్ సావంత్
గోవా సీఎం ప్రమోద్ సావంత్ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. గెలుపు, ప్రభుత్వం ఏర్పాటునకు గల అవకాశాలపై వారితో చర్చించారు. గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్, కార్యదర్శి సతీశ్ ముంబై వెళ్లి గోవా ఎన్నికల ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరపనున్నారు. గెలిచేందుకు అవకాశం ఉన్న తమ సభ్యులందరినీ పణజిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలంటూ బీజేపీ ఆదేశించింది.
బేరసారాలపై టీఎంసీ అప్రమత్తం
గోవాలో గెలిచే ప్రతి సీటూ కీలకమైంది కావడంతో టీఎంసీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. బేరసారాలు, క్యాంపు రాజకీయాలకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తోంది. ఇటువంటి వాటిని ఎదుర్కొనేందుకు పార్టీకి చెందిన కీలక నేతలు అభిషేక్ బచ్చన్, డెరెక్ ఒ బ్రియాన్‌లతోపాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించింది.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే..
40 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ చెరో 16 సీట్లు గెలుచుకుంటాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మెజారిటీ సంఖ్య మాత్రం 21. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో జట్టుకట్టి రాష్ట్రంలో మొదటిసారిగా అభ్యర్థులను బరిలోకి దించిన టీఎంసీకి మూడు సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. దీంతో, గోమంతక్ పార్టీ, టీఎంసీలతోపాటు ఆప్‌తోనూ చర్చలకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ తెలిపింది. చిన్న పార్టీలు మాత్రం ఇందుకు బదులుగా సీఎం పోస్ట్‌నే కోరుతున్నాయని. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ప్రభుత్వ ఏర్పాటు ఎవరికీ అంత సులభమైన వ్యవహారం కాదని పరిశీలకులు అంటున్నారు.
గోవా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
Published Wed, Mar 9 2022 1:45 AM | Last Updated on Wed, Mar 9 2022 1:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment