న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు గోవాలో నంబర్ గేమ్ మొదలయింది. తమకు మెజారిటీ రాకుంటే ఏం చేయాలనే దానిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ కొట్టిపారేసింది. గోవాలో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామని కమలనాథులు అంటున్నారు.
ఢిల్లీలో సావంత్
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ఢిల్లీకి వచ్చారు. గోవాలో అధికారాన్ని నిలుపుకునే అవకాశాల గురించి ప్రధానికి ఆయన వివరించనున్నారు. గోవా బీజేపీ ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కోసం తర్వాత ముంబైకి వెళ్లనున్నారు.
బీజేపీ కసరత్తు
అధికారాన్ని నిలుపుకుంటామని చెబుతూనే.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), స్వతంత్రులతో చర్చలు బీజేపీ సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రమోద్ సావంత్‌కు మద్దతు ఇవ్వడానికి ఎంజీపీ మొగ్గు చూపడం లేదని సమాచారం. ఒకవేళ తమ మద్దతు తప్పనిసరి అయితే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎంజీపీ డిమాండ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎదురయితే బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ ముందు జాగ్రత్త
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అటు కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమవుతున్నట్టు సూచనప్రాయంగా వెల్లడించింది. ‘బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామ’ని కాంగ్రెస్ నాయకుడు, గోవా ఇన్‌ఛార్జ్ దినేష్ గుండూరావు ఎన్డీటీవీతో ప్రకటించారు. సీనియర్ నాయకులు పి. చిదంబరం, డీకే శివకుమార్‌లను ఇప్పటికే గోవాకు పంపించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు వీరిద్దరూ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గెలిచే అవకాశమున్న కాంగ్రెస్ నేతలను ఇతర రాష్ట్రాలకు పంపించారు. గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. (క్లిక్: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?)
ఎగ్జిట్‌పోల్స్ ఏం చెప్పాయి
తాజా ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 16 సీట్ల చొప్పున వస్తాయని తెలిపాయి. తృణమూల్‌కు 3, ఇతరులకు 5 సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశాయి. ఎంజీపీతో పొత్తు పెట్టుకుని తొలిసారిగా గోవాలో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్‌కు 3 సీట్లు వస్తాయని అంచనా వేయడంతో ఆ పార్టీ ఈసారి కీలకం కానుంది. గోవాలో ఎవరు అధికారం చేపడతారో తెలియాలంటే మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే దాకా వేచిచూడాల్సిందే. (క్లిక్: గోవాలో హంగ్.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరో?)
Comments
Please login to add a commentAdd a comment