
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, ప్రయివేటు మెంబర్ బిజినెస్‌ను రద్దు చేస్తున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు వేర్వేరుగా జారీచేసిన బులెటిన్లలో వెల్లడించాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు వారాంతపు సెలవులు కూడా లేకుండా వరుసగా 18 రోజులపాటు జరిగే ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని, అలాగే శుక్రవారం మధ్యాహ్నం జరిగే ప్రయివేటు మెంబర్ బిజినెస్‌ను కూడా కార్యకలాపాల నుంచి తొలగించారు.
లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరితో సహా ప్రతిపక్ష నాయకులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు క్వశ్చన్ అవర్ తొలగించవద్దని లేఖ రాశారు. ఒక సభకు సంబంధించిన ఎంపీల మధ్య భౌతిక దూరం ఉండేలా చూసేందుకు రెండు సభల్లోని సీట్లను కేటాయించనున్నారు. రెండో సభలో కూర్చునే వారు సభాపతి ఉన్న సభలోకి కనిపించేలా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్‌సభ
మొదటి రోజు మినహా మిగిలిన 17 రోజులు లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 లగంటల వరకు నడుస్తుంది. అయితే తొలి రోజు మాత్రం ఉదయం 9 నుంచి 1 గంట వరకు నిర్వహిస్తారు. రాజ్యసభ మొదటి రోజు మినహా ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యకలాపాలను కలిగి ఉంటుంది. మొదటి రోజు మాత్రం మధ్యాహ్నం 3 నుండి 7 గంటల వరకు కార్యకలాపాలు కలిగి ఉంటుంది.
అప్రజాస్వామికం: కాంగ్రెస్
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌ను రద్దు చేయడం ఏకపక్షం, అప్రజాస్వామికమని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అ«ధీర్‌రంజన్ చౌధరి అన్నారు. కీలక అంశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సభ్యుల హక్కు అన్నారు. సమావేశాలకు ప్రాణాధారమైన ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆనంద్ శర్మ అన్నారు.
చర్చల నుంచి పారిపోవడం లేదు: జోషి
విపక్షాల విమర్శలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. సమావేశాల్లో ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీఏసీలో తీసుకునే నిర్ణయం మేరకు ఏ అంశాన్ని చేపట్టడానికైనా తమకు అభ్యంతరం లేదన్నారు. ఎంపీలు ‘అన్‌స్టార్‌డ్’ప్రశ్నల అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, వీటికి లిఖితపూర్వక సమాధానాలను ప్రభుత్వం ఇస్తుందన్నారు. జీరో అవర్ కనీసం అరగంటపాటు ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment