
కరీంనగర్‌టౌన్: ఇకపై కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంపైనే ప్రత్యేక దృష్టి సా రించనున్నట్లు బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. అందులో భాగంగానే ఎక్కువ సమయం నియోజ కవర్గానికే కేటాయిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దమ్ము చూపిస్తామని, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. గురువారం ఆయన కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేతల తో సంస్థాగత బలోపేతంపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు, త్వరలో చేపట్టబోయే బస్ యాత్ర వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అన్నిజిల్లాలు తిరగాల్సి రావడంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని అన్నారు.
పార్టీ ఆదేశిస్తే కరీంనగర్‌తోపాటు ఎక్కడైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 16న బైక్ ర్యాలీలు నిర్వహించాలని, 17న ఉదయం అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగరేయాలని సమావేశంలో తీర్మానించారు.