టీడీపీలో చక్రం తిప్పుతున్న ఎన్‌ఆర్‌ఐ ‘రాజా’
చంద్రబాబు, లోకేశ్ అమెరికాకు వెళితే ఈయన ఇంట్లోనే బస
ఆ చొరవతోనే ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లా సీట్లకేటాయింపు లో జోక్యం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అతనో ఎన్‌ఆర్‌ఐ.. మారుపేరు డాలర్ రాజా.. వృత్తి రీత్యా డాక్టర్.. అయితే పూర్తిగా టీడీపీ కోసమే పని చేస్తుంటాడు. అతను పుట్టింది గుంటూరులో.. ఉండేది అమెరికాలో.. ఎక్కువగా వచ్చేది కోవెలకుంట్లకు.. ఇతని తండ్రి గతంలో ఇక్కడ ఎంఈవోగా పని చేయడంతో పరిచయాలు ఎక్కువ. అతనికి కోవెలకుంట్లలో ఓ మిత్ర మండలి ఉంది. సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో బలమైన వర్గాన్ని ఏర్పరుచుకున్నారు.
ప్రతీ ఎన్నికకు టీడీపీకి భారీగా నిధులు సమకూరుస్తుంటారు. ప్రతిగా తనకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. చంద్రబాబు, లోకేశ్ అమెరికా వెళితే ఆయన ఇంట్లోనే బస చేస్తారు. ఈసారి రూ.250 కోట్లకు పైగా ఫండింగ్ సమకూర్చడమే కాకుండా టికెట్ల కేటాయింపులోనూ జోక్యం చేసుకుంటున్నారు. ఆశావహులు అధిష్టానాన్ని కాకుండా ‘డాలర్ రాజా’ను సంప్రదించడం వరకు ఈ జోక్యం వెళ్లిందంటే ఈ ‘రాజా’ మాటే చంద్రబాబుకు శాసనం అని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.
రాజా మాటే బాబు మాటట!
నంద్యాల జిల్లా టీడీపీలో బీసీ జనార్ధనరెడ్డి అంతా తానై నడిపిస్తున్నాడని, ఇతనివల్ల పార్టీ నష్టపోతోందనే అంచనాకు ఈ ఎన్‌ఆర్‌ఐ వచ్చినట్లు సమాచారం. నంద్యాల, డోన్ టికెట్లు ఫరూక్, ధర్మవరం సుబ్బారెడ్డికి తొలుత ప్రకటించడం వెనుక జనార్ధన్‌రెడ్డి ఉన్నారని ఇతని భావన. దీంతోనే డోన్ టికెట్ సుబ్బారెడ్డికి తప్పించి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి దక్కేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జనార్దనరెడ్డి వ్యతిరేకులను ఒకతాటిపైకి తెచ్చేందుకు ఈ ‘రాజా’ తెరవెనుక చక్రం తిప్పుతున్నారు.
ఆదోని టికెట్ కోసం జనసేన పట్టుబట్టినా, చివరకు దాన్ని బీజేపీకి ఇవ్వాలనే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ‘రాజా’ మాత్రం తన సామాజికవర్గ నేత మీనాక్షినాయుడుకో లేక ఆయన కుమారుడికి ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో కోడుమూరు స్థానాన్ని బీజేపీకి ఇచ్చి, ఆదోనిలో టీడీపీ తరఫున మీనాక్షినాయుడు కుమారుడు భూపాల్‌నాయుడును బరిలోకి దింపాలని చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. ఈ దెబ్బతో కోడుమూరు టీడీపీ అభ్యర్థి దస్తగిరితోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డికి కూడా చెక్ పెట్టొచ్చన్నది ఈ ‘రాజా’ ఆలోచనట.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టికెట్ రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని సురేంద్రబాబుకు రావడం వెనుక కూడా ఇతని హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురం సీటు కూడా రాప్తాడు మాజీ మండలాధ్యక్షుడు దగ్గుబాటి ప్రసాద్‌కు ఖరారు చేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతను పార్టీకి రూ.50 కోట్లు ఫండ్ ఇస్తానని చెప్పడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీని వెనుక కూడా ఈ ఎన్‌ఆర్‌ఐ పావులు కదిపినట్లు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment