
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అనుబంధ విభాగాలైన వైఎస్సార్ డాక్టర్స్, క్రిస్టియన్, మైనారిటీ, ప్రచార, చేనేత విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షులతో విజయసాయిరెడ్డి వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై టీడీపీ, దాని అనుకూల మీడియా, సోషల్ మీడియాలో కృత్రిమంగా ప్రజావ్యతిరేకతను సృష్టించే కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని సాగుతున్న ప్రచారంలో ఇసుమంత కూడా వాస్తవం లేదన్నారు.
గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయాలని, ఏపీలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. వివిధ రాష్ట్రాల అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి వెళ్తున్నారని చెప్పారు. పార్టీ కమిటీలను త్వరగా భర్తీ చేసి.. 2024 అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు క్షేత్రస్థాయిలోనే తగు రీతిలో కౌంటర్ ఇవ్వాలన్నారు.
అనుబంధ విభాగాలకు ముగ్గురేసి ఉపాధ్యక్షులు
పార్టీ అనుబంధ విభాగాలకు ముగ్గురు చొప్పున ఉపాధ్యక్షులను నియమిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ పటిష్టతకు రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా, 8 జోన్లుగా విభజించినట్టు చెప్పారు. రాష్ట్ర పార్టీ విభాగానికి అధ్యక్షుడు ఉంటారని, అధ్యక్షుడుతో పాటుగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి ఒక ఉపాధ్యక్షుడు, కోస్తాంధ్ర జిల్లాల నుంచి ఒక ఉపాధ్యక్షుడు, రాయలసీమ జిల్లాల నుండి ఒక ఉపాధ్యక్షుడు చొప్పున నియమిస్తామని చెప్పారు.
ఈ ముగ్గురు పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షుడి కింద పని చేస్తారన్నారు. ఈ సమావేశాల్లో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , డాక్టర్ల విభాగం అధ్యక్షుడు బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ విభాగ అధ్యక్షుడు మేడిది జాన్సన్, ప్రచార విభాగ కమిటీ అధ్యక్షుడు ఆర్.ధనుంజయ రెడ్డి, చేనేత విభాగ అధ్యక్షుడు గంజి చిరంజీవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment