నిరూపించలేకపోతే నువ్వు దూకుతావా?
కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సవాల్
మహిళలను బీఆర్‌ఎస్‌లో ఎదగనివ్వరు: మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చదువుకున్నారో అర్థం కావడం లేదని, రాహుల్ గాం«దీకి, మూసీకి, హైడ్రాకు ఏం సంబంధముందని ఆయన మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. హైడ్రా పేరిట వసూళ్లు చేసినట్టు నిరూపిస్తే తాను పురానాపూల్ బ్రిడ్జి మీద నుంచి మూసీలో దూకుతానని, లేదంటే కేటీఆర్ దూకాలని ఆయన సవాల్ చేశారు.
బుధవారం గాం«దీభవన్‌లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లతో కలసి ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ నేతలు యథేచ్ఛగా కబ్జాలు చేశారని, అందుకే హైడ్రా అనగానే భయాందోళనలకు గురవుతున్నారని వ్యా ఖ్యానించారు. చెట్లు, లిక్కర్, ఇరిగేషన్ పేరు మీద దోచుకుని రా ష్ట్రాన్ని లూటీ చేశారని, ఇప్పుడు ఆ సొమ్ముతో సోషల్‌మీడియాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు.
మూసీ చుట్టూ ఉన్న ఒక్క ఇల్లును కూడా ఇప్పటివరకు తొలగించలేదని, ఒకవేళ తొలగించాల్సి వచ్చినా చట్టబద్ధంగా నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. అసలు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు, హైడ్రాకు సంబంధం లేని, డీపీఆర్ తయారు కాకుండానే మూసీ అభివృద్ధికి ఎంత ఖర్చవుతుందో ఎలా చెప్తామని ప్రశ్నించారు.
మూసీ సుందరీకరణకు సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ గురించి అసభ్యంగా ట్రోల్ చేసిన విషయంలో బావకు ఉన్న సోయి బావమరిదికి లేదని, అందుకే కేటీఆర్ ట్రోల్స్‌ని ఖండించలేదని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మహేశ్‌గౌడ్ ఈ సందర్భంగా చెప్పారు.
మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది: మంత్రి సురేఖ
బీఆర్‌ఎస్‌లో రాజకీయంగా మహిళలను ఎదగనివ్వరని మంత్రి కొండా సురేఖ అన్నారు. అందుకే బొడిగె శోభ, రేఖానాయక్‌తో పాటు తనకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కుటుంబ పాలన నడవాలి కాబట్టే తమకు పదవులు ఇవ్వలేదని చెప్పారు. తనపై సోషల్‌మీడియాలో చేసిన కామెంట్లను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుందని చెప్పారు.
తాము బీఆర్‌ఎస్ లాగా సోషల్‌మీడియాను దురి్వనియోగం చేయబోమన్నారు. మూసీ చుట్టూ ఉన్న ఇళ్లను కూల్చకముందే బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించిన సురేఖ.. బతుకమ్మ పండుగకు ఏమివ్వాలన్న దానిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment