నీ జీవితమంతా అబద్ధాలే  | Peddireddy Ramachandra Reddy fires on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

నీ జీవితమంతా అబద్ధాలే 

Published Sun, Aug 27 2023 3:25 AM | Last Updated on Sun, Aug 27 2023 5:55 AM

 Peddireddy Ramachandra Reddy fires on Chandrababu naidu  - Sakshi

సాక్షి, తిరుపతి :  రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్య­క్రమాలను చూసి ఓర్వలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇసుక దోపిడీ అంటూ చంద్రబాబునాయుడు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నా­రని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర–సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరి­గారు. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలేనని ధ్వజ­మెత్తారు. నాడు నీ ఇంటి వెనుకే యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతుంటే నిద్రపోయావా? అంటూ నిలదీశారు. తిరుపతిలోని క్యాంప్‌ కార్యాల­య­ంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లా­డారు.

ప్రజా సమస్యలపై మాట్లాడే పరిస్థితి లేనందున ఇసుక దోపిడీ అంటూ చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ పేరుతో అర్థంలేని ఆరోపణలకు దిగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభు­త్వాన్ని దూషించడం, సీఎంపై వ్యక్తిగత ఆరోప­ణలు చేయడం, అబద్ధాలను నిజాలుగా భ్రమింపచేసే దిగజారుడు పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిర్వహించిన ఇసుక టెండర్లలో చంద్రబాబు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ టన్నుకు రూ.375 ప్రభుత్వానికి చెల్లించాలని, మరో రూ.వంద వారి అడ్మినిస్ట్రేటివ్‌ ఖర్చు కింద తీసుకుంటుందని వివరించారు.

మొత్తంగా టన్ను ఇసుక రూ.475 చొప్పున విక్రయించాలన్నారు. ఇందుకు భిన్నంగా ఎక్కడైనా జరిగితే  ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురా­వాలని నియోజకవర్గాల వారీగా, డిపోల వారీగా రవాణా చార్జీలతో కలిపి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను ప్రతివారం పత్రికల్లో ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్, రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు, గనుల శాఖ రీజనల్‌ స్క్వాడ్స్, ఎస్‌ఈబీ తనిఖీల ద్వారా అక్రమాలకు తావులేకుండా చేశామని చెప్పారు. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే..

పారదర్శక విధానం.. ఎన్జీటీ సంతృప్తి 
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించి, పారదర్శకంగా కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రజలకు సులభంగా తక్కువ ధరకు అందించేలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా ఇసుక తవ్వకాల టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా పూర్తి అనుమతులతో ఇసుక తవ్వకాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సైతం సంతృప్తి వ్యక్తం చేసింది. 

గత సర్కారు హయాంలో వర్షాకాలంలో నాలుగు నెలల పాటు ఇసుక లభించక రాష్ట్రంలో భవన నిర్మాణ పనులు నిలిచిపోయేవి. కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వర్షాకాలంలోనూ ఇసుక పుష్కలంగా లభ్యమయ్యేలా దాదాపు 50 లక్షల టన్నులకుపైగా ఇసుకను డిపోల్లో నిల్వ చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో ఎక్కడా నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడటం లేదు.  

ప్రభుత్వ ఆదాయం పెరిగితే దోపిడీ జరిగినట్లా?
 2018–19లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయేప్పుడు మైనింగ్‌ రెవెన్యూ రూ.1,950 కోట్లు. ఆ రోజు మైనర్‌ మినరల్స్‌లో రూ.1,263 కోట్ల ఆదాయం కాగా, మేజర్‌ మినరల్స్‌లో రూ.687 కోట్లు. 2022–23లో రూ.4,756 కోట్ల మైనింగ్‌ రెవెన్యూ వస్తే, అందులో మైనర్‌ మినరల్స్‌లో రూ.3,882 కోట్లు, మేజర్‌ మినరల్స్‌లో రూ.874 కోట్లు వచ్చింది. మా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోయి ఉంటే ఆ రూ.1,950 కోట్ల వద్దే ఉండేవాళ్లం.  

 ఏపీఎండీసీకి 2018–19లో రూ.833 కోట్ల ఆదాయం వస్తే, 2022–23 లో రూ.1,800 కోట్లు, 2023–24లో రూ.4 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా. దాదాపు రెండు, మూడు రెట్లు రెవెన్యూ పెరిగితే, మైనింగ్‌లో దోపిడీ అంటున్న చంద్రబాబు వ్యాఖ్యలు అర్థరహితం. 

మీకు మళ్లీ భంగపాటు తప్పదు
ఆరోపణలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించి, రాజకీయంగా దివాలాకోరుగా మారి అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎవరు ఎక్కువ రౌడీయిజం చేస్తే, ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటే వారికి నామినేటెడ్‌ పదవులు ఇస్తానని అంటున్నారు. యుద్ధానికి రండి... జైలుకు పోయినా పరవాలేదని అధికారంలోకి రావాలని చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ అంటున్నారు. చంద్రబాబు, లోకే‹Ô , పవన్‌ ఈ ముగ్గురు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. వీరికి మరోసారి భంగపాటు ఖాయం.

 రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తాం. సీఎం వైఎస్‌ జగన్‌ చరిష్మా ఉన్న నేత. నాడు చంద్రబాబు చేర్పించిన 60 లక్షల దొంగ ఓట్లు తొలగిస్తుంటే ఎల్లో గ్యాంగ్‌ గగ్గోలు పెడుతోంది. ఒక్క కుప్పంలోనే 36 వేల దొంగ ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్ల విషయమై ఈ నెల 28వ తేదీన మా ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోంమంత్రిని కలవనున్నారు. 

విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జడ్పీ చైర్మన్‌  శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

చింతమనేని వికృత చేష్టలు
ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ దారుణంగా దాడికి పాల్పడ్డ ఘటనను ఎవరూ మర­చి­పోలేరు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్నదని ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. టీడీపీ హయాంలో ఆగడాలకు ఈ ఘటనే మచ్చుతునక. నాడు ఇష్టారాజ్యంగా కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు చేయడంతో ఒక బోటు బోల్తాకొట్టి పలు­వురు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.

 ఇసుకపై జీఎస్టీ వసూలు చేయలేదని చంద్ర­బాబు మాట్లాడుతున్నారు. జీఎస్టీ వసూళ్లు కేంద్ర ప్రభుత్వ విభాగాలు చూసుకుంటా­యి. దాంతో రాష్ట్రానికి ఏం సంబంధం? నాడు ఉచిత ఇసుక పేరుతో దోచుకున్న డబ్బులతో నువ్వు, మీ కుమారుడు జేబులు 
నింపుకోలేదా? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు ఇసుకను తరలించలేదా?

ఉచితంగా ఎవరికైనా ఇచ్చావా?
 టీడీపీ హయాంలో తొలుత మహిళా సంఘాలకు ఇసుక తవ్వకాలను అప్పగించినా పచ్చ­మూకల బెదిరింపులతో నిస్సహాయ పరిస్థితి సృష్టించి వారి చేతి నుంచి తప్పించేశారు. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మాఫియా నెట్‌వర్క్‌ ఆవిర్భవించింది. వినియోగ­దారులు బ్లాక్‌ మార్కెట్‌ నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన ఆగత్యం కల్పించారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకుండా చేసి అక్రమ తవ్వకాలతో పచ్చ మూకలు జేబులు నింపుకున్నాయి. ప్రజలకు ఇసుక అందకుండా బ్లాక్‌ మార్కెట్‌ సృష్టించి దోపిడీకి పాల్పడ్డారు. నాడు చంద్రబాబు ఉచిత ఇసుకను ఎవరికీ ఇవ్వలేదు. 

 చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇంటి వెనుకే అక్ర­మంగా ఇసుక తవ్వకాలు రేయింబవళ్లు యథేచ్ఛగా జరిగేవి. వందల సంఖ్యలో లారీలు ఆయన ఇంటి ముందు నుంచే హైదరాబాద్‌కు తరలిపోయేవి. అప్పుడు వసారాలో తాపీగా కూర్చొని కళ్లప్పగించి చూసిన చంద్రబాబు.. ఇప్పుడు దోపిడీ జరుగుతోందంటూ నిందలు వేయడం దుర్మార్గం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇసుక దోపిడీ నిజమేనని తేలడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించడం ఎవరూ మరచిపోలేదు.

నాడు రూ.43 వేల కోట్లు మీరు దోచేసినట్లే!
♦ రూ.40 వేల కోట్ల ఇసుక అక్రమాలు జరిగాయని ఏ లెక్కల ప్రకారం మాట్లాడు­తున్నావు? టెండర్ల ద్వారా రాష్ట్రంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టును దక్కించుకున్న జేపీ వెంచర్స్‌ సంస్థ ఏటా ప్రభుత్వానికి రూ.765 కోట్లు చెల్లిస్తోంది. ఈ నాలుగేళ్లలో సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయం లభించింది. 

♦ చంద్రబాబు చెబుతున్న లెక్కల ప్రకారం రూ.40 వేల కోట్లు, మా ప్రభుత్వ హయాంలో వచ్చిన రూ.3 వేల కోట్లు కూడా కలిపితే మొత్తం 43 వేల కోట్లు.. మీ ఐదేళ్ల పాలనలో కూడా వచ్చి ఉండాలి కదా? మరి ఆ డబ్బు అంతా మీరు దోపిడీ చేశారని అంగీకరిస్తావా చంద్రబాబూ? నాటి తప్పులన్నీ నేడు జరిగినట్లు ప్రజలను భ్రమింపజేయాలన్నదే మీ ఉద్దేశం అని అర్థమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement