తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వంద రోజుల పాలనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు అంటూ ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి. ‘
లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో చిన్నారి అశ్వియా అంజుమ్ కిడ్నాప్‌కు గురై హత్య గావించబడితే పోలీసులు కనీసం పట్టించుకోలేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ కాలిపోతే డిజిపి స్పెషల్ ఫ్లైట్, ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు. డిజిపి పనితీరు మార్చుకోవాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో నాపై బురద చల్లెందుకు ఎన్నో కుట్రలు చేశారు, ఎలాంటి ఆధారాలు లభించక లేదు’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన అశ్వియా అనే బాలిక కిడ్నాప్ గురై ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడింది. అశ్వియా కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు పరామర్శించనున్నారు. అయితే పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు పుంగనూరుకు వెళుతున్నారన్న సమాచారంతో అక్కడ పెద్ద ఎత్తును పోలీసులను మోహరించింది చంద్రబాబు సర్కారు.
Comments
Please login to add a commentAdd a comment