బిష్ణుపుర్: రాబోయే ఎన్నికల్లో సమస్యలు, అరాచకం సృష్టించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతైనవాళ్లనే తమ పార్టీ ‘బయట వ్యక్తులు’(అవుట్‌సైడర్స్)గా అభివర్ణించిందని, తరాలుగా బెంగాల్లో జీవనం గడుపుతున్న ఇతర రాష్ట్రాల ప్రజలను కాదని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వివరించారు. బెంగాల్లో జీవించేందుకు భారత్‌లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లంతా తమ దృష్టిలో స్థానికులేనన్నారు. బీజేపీని అవుట్‌సైడర్స్ పార్టీ అంటూ టీఎంసీ విమర్శించడం తెల్సిందే. ఈ నినాదం రాష్ట్రంలో నివాసముండే ఇతర రాష్ట్రాలవారిపై ప్రభావం చూపవచ్చన్న అంచనాతో మమత తాజాగా వివరణ ఇచ్చారు.
‘‘తరాలుగా ఇక్కడే ఉంటున్నవారిపై బయటవారనే ముద్ర ఎందుకు? వారు బెంగాల్లో భాగం, కేవలం యూపీలాంటి రాష్ట్రాల నుంచి ఎన్నికలు చెడగొట్టేందుకు వచ్చిన అల్లరిమూకలనే మేము బయటి శక్తులుగా భావిస్తాం’’ అని మమత చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఇలాంటి బయట శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారిని దునుమాడాలని పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్, సీపీఎంపైన కూడా ఆమె నిప్పులు చెరిగారు. మైనార్టీలు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్లను చీల్చడం ద్వారా ఈ పార్టీలు బీజేపీకి లబ్ది చేకూరుస్తాయని విమర్శించారు. ప్రధాని కుర్చీపై తనకు అమిత గౌరవం ఉందని, కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం అతిపెద్ద అబద్ధాలకోరని మమతా బెనర్జీ దుయ్యబట్టారు. ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు వేసే హామీ ఏమైందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment