కాంథీలో ఎన్నికల సభలో మోదీకి నమస్కరిస్తున్న బీజేపీ నేత సువేందు అధికారి
కాంథీ(పశ్చిమబెంగాల్): వందేమాతరం అంటూ దేశాన్ని ఒక్కటి చేసిన నేల పశ్చిమబెంగాల్ అని, అలాంటి గడ్డపై ‘పరాయివారు’ అనే మాటలు వినిపిస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్థానిక నాయకుడినే సీఎం చేస్తామని మోదీ తెలిపారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కాంథీలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి నందిగ్రామ్‌లో మమతపై పోటీ చేస్తున్న సువేందు అధికారి కుటుంబానికి కాంథీ ప్రాంతంలో గట్టి పట్టుంది.
మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాలను బెంగాల్‌కు పరాయివారంటూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన పరాయివారు పాలించడాన్ని బెంగాలీలు అంగీకరించబోరని మమత ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అగ్ర నేతలను ఎన్నికల పర్యాటకులుగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ టాగోర్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు జన్మించిన బెంగాల్ గడ్డపై భారతీయులెవరూ పరాయి వారు కావని మోదీ వ్యాఖ్యానించారు. ‘మమ్మల్ని టూరిస్ట్‌లంటున్నారు. అవహేళన చేస్తున్నారు.
రవీంద్రుడి బెంగాల్‌లో ప్రజలు ఎవరినీ పరాయివారుగా చూడరు’ అని పేర్కొన్నారు. దాడి చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేసి నందిగ్రామ్ ప్రజలను మమత బెనర్జీ అవమానపర్చారని మోదీ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పథకాలను అవినీతి రహితంగా, పారదర్శకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌లో హింస, బాంబులు, తుపాకీల సంస్కృతిని రూపుమాపుతామన్నారు. ‘ఇంటి ముందుకు ప్రభుత్వం’ అని మమత ప్రచారం చేసుకుంటున్నారని, కానీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 2న ఆమె అధికారం కోల్పోయి ఇంటికి వెళ్లనున్నారని వ్యాఖ్యానించారు. తృణమూల్ ప్రభుత్వం రాష్ట్రానికి చీకటినే మిగిల్చిందని, బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధితో రాష్ట్రాన్ని బంగారు బంగ్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment