హూగ్లీ జిల్లాలో సభలో కార్యకర్తతో మోదీ
సోనార్‌పూర్: బీజేపీ నాయకులను బయటి వారంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలను, భారత రాజ్యాంగ విలువలను అవమానించడమేనన్నారు. బీజేపీ గెలిస్తే ఈ గడ్డపై పుట్టినవారే సీఎం అవుతారన్నారు. బెంగాల్‌లో శనివారం ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ‘బ్రిటిషర్లు భారత్‌ను విభజించాలని చూసినప్పుడు భారతదేశం అంతా ఒక్కటే. భారతీయుల ఆకాంక్షలు ఒక్కటే అని నేతాజీ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు నేతాజీ ఆదర్శాలను, సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బదులుగా బయటివారు అంటూ దీదీ మాట్లాడుతున్నారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారతీయులంతా భరతమాత పిల్లలని, భారతీయులెవరూ ఇక్కడ బయటివారు కాదని స్పష్టం చేశారు.
‘మీ గూండాలకు జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మోదీ వచ్చాడు.. మీ ఆటలు సాగవని వారికి చెప్పండి’ అని మమతకు సూచించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ మోదీకి పోటీగా వారణాసిలో పోటీ చేస్తారన్న వార్తలను ప్రస్తావిస్తూ.. దాంతో మమత దీదీ ఇక్కడ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమైందన్నారు. యూపీ, వారణాసి ప్రజలు బెంగాలీల మాదిరిగానే సహృదయులని, మమతను వారు బయటి వ్యక్తి అని అవమానించబోరని ఎద్దేవా చేశారు. ‘మమతా బెనర్జీ తరచూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు. ఆటగాళ్లు అంపైర్‌ను తప్పుబడితే.. ఆట ముగిసినట్లే అన్న విషయం మీకు తెలుసు కదా’ అని మోదీ హూగ్లీ జిల్లాలో జరిగిన ఒక ప్రచార సభలో వ్యాఖ్యానించారు. సింగూర్‌లో టాటా నానో కారు ప్లాంట్‌ను అడ్డుకోవడాన్ని గుర్తు చేస్తూ.. మమతా బెనర్జీ, టీఎంసీల నిరోధక మనస్తత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకుని, అదే గొప్పగా చెప్పుకునే పార్టీని ఎక్కడా చూడలేదన్నారు.
అస్సాంలో..
ఇంకా లొంగిపోని మిలిటెంట్లు జనజీవన స్రవంతిలో కలవాలని మోదీ కోరారు. అస్సాంలోని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌లో ఉన్న బక్సా జిల్లాలో శనివారం ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. మిగిలిన మిలిటెంట్లు కూడా ప్రధాన స్రవంతిలోకి రావాలని, అది ఆత్మనిర్బర్ అస్సాంకు అవసరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హింసను ప్రోత్సహించిందని, అయితే, రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి, శాంతికి, సుస్థిరతకు ఓటేశారని వ్యాఖ్యానించారు. బీజేపీ సభలకు పెద్ద ఎత్తున మహిళలు రావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. కోక్రాగఢ్ జిల్లాలో గురువారం జరిగిన సభకు కూడా మహిళలు భారీగా రావడంపై ఒక విశ్లేషకుడిని ప్రశ్నించగా.. తమ పిల్లలు ఇక మళ్లీ ఆయుధాలు పట్టి అడవుల్లోకి వెళ్లరనే విశ్వాసంతో వారు బీజేపీకి మద్దతిస్తున్నారని ఆయన చెప్పారని మోదీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment