జంగారెడ్డిగూడెం: రాజధాని విషయంలో ప్రజలను, రైతులను మోసగించిన విపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌పై నిందలు మోపుతున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నారు. సీఎం జగన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికే మూడు రాజధానులను ప్రకటించినట్లు చెప్పారు. బుధవారం జంగారెడ్డిగూడెంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కోర్టుకు ఆ అధికారం ఉందా..?
రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకునేందుకు కోర్టుకు ఉన్న హక్కులు ఏమిటి? న్యాయమూర్తుల తీర్పును నేను వ్యతిరేకించడం లేదు. ఒకసారి ఆలోచించాలి. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయమా? కోర్టులు చేసే నిర్ణయమా? రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదే. పరిపాలనా విధుల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం లేదు. మూడు నెలల్లో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించే అధికారం కూడా లేదు.
నిధులను బట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ రెండింటిపై విరుద్ధమైన తీర్పులు ఇచ్చాయి. తీర్పుపై కచ్చితంగా కామెంట్ చేస్తాం. న్యాయమా.. కాదా? అని కామెంట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. న్యాయమూర్తులను మేము కామెంట్ చేయడం లేదు. తీర్పును మాత్రమే కామెంట్ చేస్తున్నాం. అంబేడ్కర్ చెప్పినట్లు రెండు రాజధానులు, మూడు రాజధానులు పెట్టుకోవడం తప్పేమీ కాదు. అంబేడ్కర్ ఆనాడే దక్షిణాదిలో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని సూచించారు. రాజధానుల విషయంలో రాజ్యాంగంలో సవివరంగా పేర్కొన్నారు.
33 వేల ఎకరాలు అవసరమా..?
రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరమా? హైదరాబాద్ లాంటి రాజధానిని సుమారు 5 వేల ఎకరాల్లో నిర్వహిస్తుండగా రాష్ట్రంలో రాజధానికి 33 వేల ఎకరాలు అవసరమా? చంద్రబాబు ఆయన కోటరీకి మేలు చేయడానికి, భూములతో వ్యాపారం చేసేందుకే పెద్ద ఎత్తున సేకరించారు. చంద్రబాబుకు దళితులు, పేదలంటే చులకన. అమరావతి ప్రాంతంలో 29 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని ప్రభుత్వం భావిస్తే అందుకు అడ్డుపడి స్టే తెచ్చారు.
బాబు కుటిల రాజకీయాలు..
చంద్రబాబు కుటిల రాజకీయాన్ని ప్రజలు గమనించాలని చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్ బీవీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
రాజధానిపై మోసగించింది బాబే
Published Thu, Sep 15 2022 4:36 AM | Last Updated on Thu, Sep 15 2022 12:49 PM
Comments
Please login to add a commentAdd a comment