న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. ‘‘బీజేపీలో చేరాల్సిందిగా నలుగురు ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్ కుమార్‌లను ఆ పార్టీ నేతలు ఒత్తిడి చేశారు. లేదంటే మనీశ్ సిసోడియా మాదిరిగా తప్పుడు కేసులు, సీబీఐ, ఈడీ దాడులు తప్పవంటూ బెదిరించారు. ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు ఆఫర్ చేశారు. తమతో పాటు మరో ఎమ్మెల్యేను కూడా తీసుకొచ్చిన వారికి రూ.25 కోట్లు ఇస్తామన్నారు’’ అని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు.
నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నయానో భయానో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చిన వ్యూహాన్నే తమ పార్టీపైనా ప్రయోగిస్తోందని ఆరోపించారు. ‘‘వాళ్ల ప్రలోభాలకు సిసోడియా లొంగకపోవడంతో ఇతర ఎమ్మెల్యేలపై పడ్డారు. కానీ వాళ్లంతా ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చారు. బెదిరింపులకు లొంగే, అమ్ముడుపోయే రకం కాదు’’ అన్నారు.
ప్రాణాలైనా ఇస్తాం గానీ పార్టీకి ద్రోహం చేయబోమని సిసోడియా ట్వీట్ చేశారు. ‘‘మేమంతా కేజ్రీవాల్ సైనికులం. భగత్‌సింగ్ అనుయాయులం. మీ సీబీఐ, ఈడీ మమ్మల్నేమీ చేయలేవు’’ అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ముగిసేదాకా తమపై సీబీఐ, ఈడీ దాడులు జరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసంలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. విపక్షాలను లేకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరపాలని నిర్ణయించింది.
ఈ ప్రశ్నలకు బదులివ్వండి: బీజేపీ
ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. మద్యం పాలసీలో అవినీతి బట్టబయలు కావడంతో శిక్ష తప్పదనే అసహనంతోనే ఆ పార్టీ నేతలు ఇలాంటి తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా విమర్శించారు. వాళ్లకు దమ్ముంటే డబ్బులు ఆఫర్ చేసిన బీజేపీ నేతల పేర్లు చెప్పాలని సవాలు విసిరారు. ‘‘ఆప్‌కు భారీ కమీషన్లు ముట్టజెప్పిన వాళ్లకే కేజ్రీవాల్ సర్కారు మద్యం లైసెన్సులు కట్టబెట్టింది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే. విచారణను తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా ఒక్క ఫైలుపై తన సంతకం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై తమ ప్రశ్నలకు బదులివ్వలేక ఆప్ ఇలా తప్పుడు ఆరోపణలకు దిగిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆరోపించారు. ‘నిపుణుల కమిటీ వద్దన్నా వినకుండా హోల్‌సేల్ మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యక్తులపరం చేశారు. భారీగా లంచాలు తీసుకుని బ్లాక్ లిస్టెడ్ కంపెనీలకూ లైసెన్సులిచ్చారు’ అని అన్నారు. కేజ్రీవాల్ అండ్ కో నిజాయతీ, పారదర్శకతలకు పాతరేసి చూస్తుండగానే అవినీతిలో కూరుకుపోయిందంటూ కాంగ్రెస్ కూడా దుమ్మెత్తిపోసింది.
Comments
Please login to add a commentAdd a comment