ఆసక్తికరంగా ఖమ్మం పాలిటిక్స్‌.. ఎంపీ రేసులో ఎవరెవరంటే? | Political Suspense Over Khammam Congress MP Ticket | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా ఖమ్మం పాలిటిక్స్‌.. ఎంపీ రేసులో ఎవరెవరంటే?

Published Wed, Jan 10 2024 9:51 AM | Last Updated on Wed, Jan 10 2024 1:29 PM

Political Suspense Over Khammam Congress MP Ticket - Sakshi

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల సంబంధికులు టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ వస్తే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నామన్న సంకేతాలను సైతం ఇప్పటికే ఇచ్చారు. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టికెట్ ఎవరికి వస్తుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుంది. తెర వెనుక ఏం జరుగుతోంది?..

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్‌కు తీవ్రమైన పోటీ నెలకొంది. ఎంపీ టికెట్ రేసులో ఉన్న వారంత కీలకమైన నేతలే. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక ఖమ్మం జిల్లాకే మూడు మంత్రి పదవులను కేటాయించిన విషయం తెలిసిందే. మంత్రి పదవులు వచ్చిన వారంత కీలక నేతలే కావడం విశేషం. డిప్యూటి సీఎం పదవి భట్టి విక్కమార్కకు రాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుకు మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీగా సీట్లు రావడం వెనుక సైతం ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించారనే చెప్పాలి.

ఇక, సీన్ కట్ చేస్తే ఈ ముగ్గురు మంత్రులకు చెందిన సంబంధికులు ఎంపీ టికెట్ రేసులో ఉండటం ఆసక్తికరమైన పరిణామంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల వివిధ చోట్ల జరిగిన సభల్లో అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో భట్టికి ఉన్న అనుచర గణం, ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో మధిర నుంచి ఆయన విజయం సాధించడం వంటి అంశాలు నందినికి కలిసొస్తాయని మద్దతుదారులు చెబుతున్నారు. భట్టి పోటీ చేసిన ప్రతీసారి ఆమె నియోజకవర్గమంతా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న పరిచయాలు, భట్టి నాయకత్వం కలిసొస్తాయనే భావనతో పోటీకి సై అంటున్నారు

మరో కీలక నేత, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి వైఎస్సార్‌సీపీ, బీఆర్‌ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఏ కార్యక్రమం చేపట్టినా సోదరుడు ప్రసాద్‌రెడ్డి తెర వెనుక నుంచి అన్ని తానై చూసుకుంటున్నారు. పార్టీ నేతలు, కేడర్‌కు పూర్తిస్తాయిలో అందుబాటులో ఉంటూ 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పొంగులేటి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విస్తృత ప్రచారం చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ రెడ్డి ఆశీస్సులతో ప్రసాద్‌రెడ్డి ఖమ్మం ఎంపీ బరిలో నిలబడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌ పార్టీ, పొంగులేటికి ఉన్న చరిష్మా తోడైతే ప్రసాద్‌రెడ్డి విజయం ఖాయమనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌ పరిధి నేతలతో ఉన్న పరిచయాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. 

సీనియర్‌ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనయుడు యుగంధర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంతో ఉన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం ఆలోచనలో ఉన్నట్లు తుమ్మల అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు స్థానాల్లో తుమ్మల పోటీ చేసినప్పుడల్లా యుగంధర్‌ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ నేతలు, కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతలన్నీ ఆయనే దగ్గరుండి చూశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సైతం ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మలకు భారీ మెజార్టీ రావడంలో యుగేంధర్ కీలకంగానే వ్యవహరించారు. దీంతో యుగంధర్ ఖమ్మం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ తుమ్మల అనుచరుల ద్వారా సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. 

ఈ ముగ్గురు మంత్రుల సంబంధికులతో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ సైతం టికెట్ కొసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీని సైతం తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని రాష్ట్ర నేతలు ఇప్పటికే కోరారు. సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది.

అయితే, ఒకవేళ పోటీ చేసే అవకాశం ఉంటే పార్టీ కొంత వీక్ ఉన్న ప్రాంతంలోనే సొనియాను బరిలో నిలిపాలని భావిస్తున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి మంచి పట్టు ఉంది. ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో సోనియా గాంధీ వంటి బలమైన నేతకు ఖమ్మం నుంచి పోటీ చేయిస్తే పార్టీకి కొత్తగా లాభం చేకూరేదేమీ ఉండదన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఈసారి కాంగ్రెస్‌లో ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందన్న ఆసక్తికరమైన చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement