బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్లను చేర్చుకోవద్దంటూ నిరసనలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాల కాంగ్రెస్‌లో చేరికల చిచ్చు రాజుకోగా.. నడిగడ్డలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆ పారీ్టలో అలజడి సృష్టిస్తోంది. ప్రధానంగా తాజా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సరిత వర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ ఆమె వర్గానికి చెందిన అనుచరులు, అభిమానులు రోడ్డెక్కుతున్నారు.
నియోజకవర్గంలోని గద్వాల మున్సిపాలిటీతోపాటు కేటీదొడ్డి, మల్దకల్, గట్టు మండలాల్లోని పలు ప్రాంతాల్లో సరిత వర్గానికి చెందిన నాయకులు గురువారం ధర్నాలకు దిగారు. గద్వాల పట్టణంలోని రాజీవ్‌మార్గ్‌లో ప్రసాద్ అనే వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. సరిత గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
శనివారం స్పష్టత..
ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం గద్వాల పట్టణంలో బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు తన అభిమానులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చేరాలని మంత్రి జూపల్లిని సంప్రదించిన మాట వాస్తవమేనని చెప్పారు. కాగా, శనివారం హైదరాబాద్‌కు రమ్మని ఎమ్మెల్యే బండ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్‌చేసినట్లు సమాచారం. దీంతో ఆయన ఏ రోజు కాంగ్రెస్‌లోకి వస్తారన్నది శనివారం తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment