మీరంతా నన్ను నయా ఇందిరమ్మ అంటున్నారు. ఆమెతో పోలుస్తుంటే నాపై బాధ్యత పెరుగుతోంది. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన నేను మోసపూరిత వాగ్దానాలు ఇవ్వలేను. అబద్ధాలు చెప్పను. దేశంలో రాజకీయాలను చూస్తుంటే బాధ కలుగుతోంది. మతం, జాతి పేరుతో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. అధికారం కోసం ఏం చేసేందుకైనా వెనుకాడడం లేదు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వామిక పాలన లేదని, నియంతృత్వం కొనసాగుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శించారు. టీఆర్‌ఎస్ నేతలు ఈ రాష్ట్రం తమ జాగీర్ అనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల పోరాటాలను అర్థం చేసుకుని తెలంగాణ ఇచ్చారని.. కానీ ప్రజల కలలను, ఆకాంక్షలను బీఆర్‌ఎస్ ఛిద్రం చేసిందని ఆరోపించారు. దేశంలో మతం, జాతి పేరిట రెచ్చగొట్టి అధికారం దక్కించుకునే రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఈ అనైతిక రాజకీయాల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన ప్రజలపై ఉందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ‘యువ సంఘర్షణ సభ’లో ప్రియాంకా గాంధీ మాట్లాడారు. ప్రసంగం ఆమె మాటల్లోనే..
‘‘తెలంగాణ ఒక లక్ష్యం కోసం ఏర్పాటైంది. ఈ గడ్డపై ఉన్న ప్రేమతో తెలంగాణను తల్లితో సమానంగా చూస్తారు. రాష్ట్రం ఏర్పాటు కోసం శ్రీకాంతాచారి సహా ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పాటైతే ఉద్యోగాలు వస్తాయని, నీళ్లు వస్తాయని, పంటలకు మద్దతు ధర లభిస్తుందని, కడుపు నిండా అన్నం తింటామని అంతా ఆశించారు. ఈ ఉద్యమాన్ని ఎవరూ ముందుండి నడిపించలేదు. అన్నివర్గాల ప్రజల పోరాటమే తెలంగాణను తెచ్చింది.
బలిదానాల విలువ మాకు తెలుసు
అమరవీరులు ఒక మహోన్నత ఆశయంతో ప్రాణాలను త్యాగం చేస్తారు. వారి బలిదానం విలువ ఏమిటో మా కుటుంబానికి, నాకు తెలుసు. నా నానమ్మ ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అందుకే అమరవీరుల త్యాగం వృధా కావొద్దని మా కుటుంబం కోరుకుంటుంది. ఇక్కడి యువత మనసును అర్థం చేసుకుని సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున అధికారం కోసమో, రాజకీయం కోసమే ఆలోచిస్తే.. ఈ నిర్ణయం తీసుకునేవారు కాదు.
అధికారంలో ఉన్న వారికే అన్నీ..
అమరుల ఆశయాలు, సోనియాగాంధీ ఆలోచనల మేరకు రాష్ట్రంలో పాలన జరగడం లేదు. నిధులు, ఉద్యోగాలు అన్నీ అధికారంలో ఉన్న వారికి, వారి తాబేదార్లకే అందుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తోంది. ఈ రాష్ట్రం వాళ్ల జాగీర్ అని, వారు నయా జాగీర్దార్లని అనుకుంటున్నారు. తెలంగాణ యువత బలిదానాలు చేసింది ఇందుకోసం కాదు. వారి హక్కుల సాధన కోసం చేశారు.
ఒక్క హామీని నెరవేర్చలేదు..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీఆర్‌ఎస్ ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పింది. రైతులకు రుణమాఫీ చేస్తామన్నది. కానీ ఇప్పుడు ఒక్కో రైతు నెత్తిపై రెండున్నర లక్షల రుణం ఉంది. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కుటుంబానికో ఉద్యోగం అన్నారు. ఇవ్వలేదు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యూనివర్సిటీల్లో ఉద్యోగ నియామకాల్లేవు.
నిర్ణయం తీసుకునే బాధ్యత మీదే..
కొన్నినెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరు వస్తే ఏం చేస్తారో ఆలోచించుకోవాలి. మేం ‘హైదరాబాద్ డిక్లరేషన్’కు కట్టుబడి ఉంటాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చకపోతే మమ్మల్ని దింపేయండి. ఈ దేశాన్ని అనైతిక రాజకీయాల నుంచి కాపాడుకోవాలంటే మీరు చైతన్యవంతులు కావాల్సిందే. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తా. మీతో మాట్లాడుతా. తెలంగాణ నంబర్ వన్ కావాలన్నదే నా ఆకాంక్ష..’’ అంటూ ప్రియాంక తన ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment