అమృత్‌సర్: పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఇద్దరు కూతుళ్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. తండ్రుల గొప్పదనాన్ని వివరిస్తూ వారు ప్రచారం చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కుమార్తె రుబియా కౌర్ సిద్ధూ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ కూతురు హర్షిత ఈసారి తండ్రులకు తోడుగా తొలిసారి ప్రచారంలోకి దిగారు. ఎంతో అనుభవమున్నట్టుగా, ఓటర్లలో సెంటిమెంట్ రగిలేలా మాట్లాడుతున్నారు. సిద్ధూ పోటీ చేస్తున్న అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గంలో రుబియా ప్రచారం చేశారు. సింగపూర్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన ఆమె తన తండ్రిపై ప్రేమను అడుగడుగునా ప్రదర్శిస్తున్నారు.
సిద్ధూను సీఎం అభ్యర్థిగా చేయకపోవడంపై ఆమె ప్రచారంలో కంటతడి పెట్టుకున్నారు కూడా! ‘‘ఒక కూతురిగా నేనొక్కటే చెప్పదలచుకున్నా. ప్రజాకర్షణ, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి సీఎం అభ్యర్థి కాలేకపోయారు. మున్ముందు ఏం జరగనుందో చూద్దాం. నీతిమంతుల్ని ఎవరూ ఎక్కువ కాలం ఆపలేరు. అలాగే అవినీతిపరులకు ఎదురుదెబ్బ తప్పదు’’ అన్నారు. పంజాబ్ ప్రజలు పేద సీఎంను కోరుకుంటే, చన్నీ కోట్లకు పడగలెత్తారని, ఆయన బ్యాంకు ఖాతాల్లోనే 133 కోట్లుంటాయని ధ్వజమెత్తారు.
చదవండి: (కేజ్రీవాల్‌ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ..)
కేజ్రివాల్ కుమార్తె హర్షిత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ తరఫున ధురిలో ప్రచారం చేశారు. తన తండ్రి పంజాబ్ బాలల కోసమే ఎక్కువగా ఆలోచిస్తారని, వారు బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే భావి భారతం బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఐఐటీ ఢిల్లీలో చదివిన హర్షిత తనపై తండ్రి ప్రభావం చాలా ఉందని చెప్పారు. ‘‘నా స్నేహితులు చాలామంది విదేశాలకు వెళ్లిపోయారు. నేనూ వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడే ఉండి దేశం కోసం పని చేయాలని నాన్న చెప్పారు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా దేశం కోసం చేస్తేనే తృప్తి’’ అంటూ నాన్నను ఆకాశానికెత్తేశారు.
Comments
Please login to add a commentAdd a comment