స్వర్ణదేవాలయంలో మాన్, కేజ్రీవాల్ ప్రార్థనలు
అమృత్‌సర్: పంజాబ్‌కు ఎన్నో ఏళ్ల తర్వాత నిజాయితీ పరుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా వస్తున్నారని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ నిజాయితీతో కూడిన పాలనను అందిస్తుందని చెప్పారు. కాబోయే ముఖ్యమంత్రి భగ్‌వంత్ మాన్‌తో కలిసి ఆదివారం ఆయన ఆప్ ఆధ్వర్యంలో అమృత్‌సర్‌లో చేపట్టిన రోడ్ షోలో పాల్గొన్నారు. తమ పార్టీకి ఘన విజయం సమకూర్చిన పంజాబ్ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
‘ఎన్నో ఏళ్ల తర్వాత పంజాబ్‌కు నిజాయితీ పరుడైన వ్యక్తి సీఎం అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మాన్ చాలా నిజాయితీ పరుడు. నిజాయితీతో కూడిన పాలనను ప్రభుత్వం అందిస్తుంది. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను గౌరవిస్తుంది’ అని తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలెవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే జైలుకు పంపిస్తామన్నారు. మాన్ ఒక్కరేకాదు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఇక ముఖ్యమంత్రేనన్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్, సుఖ్ బీర్ సింగ్ బాదల్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చరణ్‌జిత్ చన్నీ, విక్రమ్ సింగ్ మజితియా వంటి స్వార్థపూరిత రాజకీయ నేతలకు పంజాబ్ ప్రజలు ఓటమి రుచి చూపించారని, ఇది కేవలం పంజాబీలకే సాధ్యమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment