రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాక రేపుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజక వర్గాలకు సంబంధించి పలు పార్టీలు సవాల్ విసురుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో హైవోల్టేజీ పోటీకి రంగం సిద్ధమైంది.
పంజాబ్‌లో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తన లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటి సీట్ల సంఖ్యను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఇతర రాష్ట్రాల్లో సీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఇక్కడ మాత్రం విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.
సుఖ్‌బీర్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్‌ఒకప్పుడు రాష్ట్రంలో గణనీయమైన పలుకుబడిని కలిగి ఉండేది. 2019లో ప్రాభవాన్ని కోల్పోయిన తర్వాత ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తమ సీట్ల సంఖ్యను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. పంజాబ్‌లో పెద్దగా సీట్లు సాధించలేకపోయినప్పటికీ బీజేపీ కూడా తమదైన స్థాయిలో ప్రభావాన్ని చూపుతోంది. 2020-21లో రైతు ఆందోళనల మధ్య ఎన్‌డీఏ నుండి బయటకు వచ్చే వరకు బీజేపీ, ఎస్‌ఏడీ రెండూ రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉండేవి.
గత ఫలితాలు
2019 లోక్‌సభ ఎన్నికలలో పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలను గెలుచుకోగా శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. ఆప్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది.
పంజాబ్‌లో అమృత్‌సర్, గురుదాస్‌పూర్, ఖదూర్ సాహిబ్, హోషియార్‌పూర్, జలంధర్, ఆనంద్‌పూర్ సాహిబ్, లూథియానా, ఫతేఘర్ సాహిబ్, ఫరీద్‌కోట్, ఫిరోజ్‌పూర్, భటిండా, సంగ్రూర్, పాటియాలాతో సహా 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అనేక ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా కాకుండా కూటములకు బదులు విడివిడిగా పోటీ చేయడానికి పార్టీలు సిద్ధమయ్యాయి.
ఈసారి ఏం జరగనుంది?
2024 లోక్‌సభ ఎన్నికలలో పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తమ పట్టును మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. రాష్ట్రంలోని 13 సీట్లలో అత్యధిక స్థానాలు గెలవడంపై దృష్టి పెట్టింది. దాని ఇండియా కూటమి మిత్రపక్షమైన కాంగ్రెస్ కూడా కేంద్రంపై రైతు ఆగ్రహాన్ని తట్టిలేపుతూ తన సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది.
రెండు పార్టీలు రాష్ట్రంలో తమ అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నాయి. అందుకే వారు సీట్ల భాగస్వామ్య ఒప్పందానికి దూరంగా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో తన ఉనికిని పదిలం చేసుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాషాయ పార్టీ తన మాజీ భాగస్వామి శిరోమణి అకాలీదళ్‌తో ఇంకా పొత్తు పెట్టుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment