200 స్థానాలున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది. బీజేపీ, పాలక కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ మేనియా తమను ఈసారి కచ్చితంగా గట్టెక్కిస్తాయని బీజేపీ ఆశపడుతోంది. ఇక అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపైనే నమ్మకం పెట్టుకుంది. మరోవైపు రెండు పార్టీలూ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నాయి. పైగా అవతలి పార్టీలోని తలనొప్పులు తమకే మేలు చేస్తాయన్న భావనలో ఉన్నాయి...!
ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చడం రాజస్తాన్ ఓటర్లకు ఆనవాయితీ. 1993 మధ్యంతర ఎన్నికల నాటినుంచి ఏ పార్టీ కూడా అధికారాన్ని నిలబెట్టుకున్న చరిత్ర లేదు. అలా చూస్తే ఈసారి బీజేపీకి అవకాశం దక్కాలి. దీనికి తోడు కాంగ్రెస్‌లో సీఎం గెహ్లోత్, ఆ పార్టీ అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలను వీలైనంతగా ప్రచారం చేయడం ద్వారా మరింత లబ్ధి పొందాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. అంతేగాక కొన్నేళ్లుగా ఎన్నో శాంతిభద్రతల సమస్యలను రాజస్తాన్ చవిచూడటాన్ని ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇక అవినీతి విచ్చలవిడిగా మారిపోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అయినా గెహ్లోత్‌కే మొగ్గు...!
అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు, అంతర్గత కుమ్ములాటల వంటివి ఎన్నున్నా గెహ్లోత్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతుండటం విశేషం! ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెహ్లోత్ పలు ప్రజాకర్షక పథకాలను వరుసబెట్టి ప్రకటించారు. ఇవన్నీ జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నట్టు చెబుతున్నారు. 2014లో రాష్ట్రంలో కనిపించిన మోదీ వేవ్ ఇప్పుడు దాదాపుగా లేనట్టేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటివాటి వల్ల మోదీపై రాష్ట్ర ప్రజలకు భ్రమలు తొలగాయంటూ కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా కేంద్రం పట్ల మహిళల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఇది తమకు బాగా అనుకూలిస్తుందని ఆ పార్టీ నేతలంటున్నారు.
అధికార ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి ఆ పార్టీకి బాగా చేటుచేయవచ్చన్న అభిప్రాయం అంతర్గతంగా వినిపిస్తోంది. పైగా వారిలో చాలామందిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు వస్తున్న వార్తలు నాయకత్వానికి సమస్యగా మారాయి. ఇవన్నీ అంతిమంగా పుట్టి ముంచితే ఎలాగన్న ఆందోళన కాంగ్రెస్ అధిష్టానంలో నెలకొంది. అందుకే బీజేపీ బాటలోనే ఆ పార్టీ ఈసారి గెహ్లోత్‌ను సీఎం అభ్యర్థిగా ఎక్కడా పెద్దగా ప్రచారం చేయడం లేదు. అయితే ఈ ఎత్తుగడ అంతిమంగా బెడిసికొట్టి వారికే చేటు చేసే ప్రమాదం లేకపోలేదంటూ వస్తున్న వార్తలు పార్టీ పెద్దలను చికాకు పరుస్తున్నాయి.
గుజ్జర్లు ఏం చేస్తారో?
- 24 అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయకంగా ఉన్న గుజ్జర్లు, మీనా సామాజిక వర్గం ఓటర్లు ఈసారి కాంగ్రెస్‌ను ఆదరించడం కష్టమేనంటున్నారు.
- ఇక ఓబీసీ సామాజికవర్గంలో ప్రధానమైన జాట్‌లు గెహ్లోత్‌తో ఎప్పుడూ సంతృప్తిగా లేరు పైగా జాట్ ప్రాబల్య స్థానాల్లో రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ పోటీకి దిగుతుండటం కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీసేలా కనిపిస్తోంది.
- గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన సచిన్ పైలట్ సీఎం అవుతారన్న భావనతో గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు కాంగ్రెస్‌కు జైకొట్టారు. ఈసారి వారు బీజేపీకేసి మొగ్గితే కాంగ్రెస్‌కు కష్టమేనని చెబుతున్నారు.
- భారతీయ ఆదివాసీ పార్టీ 2018లో రెండు స్థానాలే గెలిచినా పలు గిరిజన ప్రాంతాల్లో గణనీయంగా ఓట్లు సాధించింది. బీఎస్పీ సైతం కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుంచి 5 శాతం ఓట్లు కొల్లగొట్టినట్టు గత ఎన్నికల ఫలితాల విశ్లేషణలో తేలింది. ఈసారి ఈ ట్రెండ్ కొనసాగితే కాంగ్రెస్‌కు మరింత నష్టమే.
బీజేపీకీ ఇంటి పోరు
బీజేపీ ఇంటి పోరుతో సతమతమవుతోంది. ముఖ్యంగా మాజీ సీఎం వసుంధర రాజే వర్గం స్థానిక బీజేపీ ముఖ్యులకు సహాయ నిరాకరణ చేస్తూ చిక్కులు సృష్టిస్తోంది. ఈ గొడవలు ముదిరితే మొదటికే మోసమని గ్రహించిన అధిష్టానం ఈసారి సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించకుండా జాగ్రత్త పడింది. రాజే సూచించిన వారిలో పలువురికి టికెట్లు నిరాకరించింది. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో పడింది.
- హిందూత్వ కార్డుతో పాటు మోదీ ఛరిష్మాపైనే బీజేపీ ప్రధానంగా నమ్మకం పెట్టుకుంది.
- కానీ వసుంధర రాజే మాదిరిగా రాష్ట్రమంతటా జనాకర్షణ ఉన్న మరో నాయకుడంటూ ఎవరూ లేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు
100 యూనిట్లదాకా ఉచిత కరెంటు
రూ.500కే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్
వృద్ధాప్య పింఛన్ల మొత్తం పెంపు
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం
Comments
Please login to add a commentAdd a comment