4 YSRCP Candidates Unanimously Elected For Rajya Sabha Seats In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఏపీ: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం

Published Fri, Jun 3 2022 4:33 PM | Last Updated on Sat, Jun 4 2022 2:30 AM

Rajya Sabha Elections Unanimous In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ ప్రాంగణంలో శుక్రవారం రిటర్నింగ్‌ అధికారి, శాసనమండలి ఉప కార్యదర్శి పి.వి.సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు. వారికి  ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ నెల 1వ తేదీన నామినేషన్‌ పత్రాల పరిశీలన పూర్తయింది. ఉపసంహరణ గడువు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అనంతరం ఈ నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నలుగురి ఎన్నికతో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఎంపీలుగా ఎన్నికైన నలుగురు ధ్రువీకరణ పత్రాలు అందుకున్న అనంతరం అసెంబ్లీ ఆవరణలోను, సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తామని చెప్పారు. వారు ఇంకా ఏమన్నారంటే..

ఏపీ ప్రయోజనాల కోసం శ్రమిస్తాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పి ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాల కోసం కృషిచేస్తా. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా సీఎం జగన్‌ ఆశయాలు, పార్టీ విధివిధానాల మేరకు పనిచేస్తా. రాజ్యసభలో 50 శాతానికిపైగా బీసీలకు స్థానం కల్పించడం చరిత్రాత్మకం. ప్రజాసేవలో ఇంతగొప్ప అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – వి.విజయసాయిరెడ్డి 

బీసీలంతా జగన్‌ వైపే
సీఎం జగన్‌ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించి వెనుకబడిన కులాలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలంతా జగన్‌ వైపే ఉన్నారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక బీసీల సంక్షేమం, రాజ్యాధికారం మాటల్లో కాకుండా చేతల్లో అమలు చేసి చూపిస్తున్నారు.
– ఆర్‌.కృష్ణయ్య 

బీసీల హృదయాల్లో చెరగని ముద్ర
వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక భరోసాతోపాటు రాజకీయంగా ఉన్నతమైన అవకాశాలు కల్పించడం ద్వారా ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. వైఎస్సార్‌సీపీకి తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులుంటే ఐదుగురు బీసీలే. పరిమళ్‌ నత్వానీ కూడా బీసీ వర్గానికి చెందినవారే. అందుకే బీసీల హృదయాల్లో సీఎం జగన్‌ శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకున్నారు. – బీద మస్తాన్‌రావు 

ప్రజాసేవ గొప్ప వరం
ప్రజాసేవలో నాకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇదొక గొప్ప వరంగా భావిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధికి సీఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాను. సీనియర్‌ నాయకుల సలహాలతో ముందుకెళ్తా. ప్రజాసమస్యల పరిష్కారానికి పార్లమెంట్‌ సాక్షిగా నిరంతరం శ్రమిస్తా.  – నిరంజన్‌రెడ్డి

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎంపీలు 
రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీలు బీద మస్తాన్‌రావు, ఆర్‌.కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్న అనంతరం వారు నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్‌ను కలుసుకున్నారు.   

రాజ్యసభకు ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎంపీల నేపథ్యం ఇదే..
ఆర్‌ కృష్ణయ్య: ప్రముఖ బీసీ సంఘ ఉద్యమ నేత. సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లిలో జన్మించారు. ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్‌ఎల్‌ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో  రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్‌.కృష్ణయ్యకు గుర్తింపు. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్‌ కృష్ణయ్య.  నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ కోసం సైతం పోరాటాలు చేశారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా..  ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. 

బీద మస్తాన్‌రావు: ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్‌సీపీ నేత బీద మస్తాన్‌రావు.. జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జన్మించారు. విద్యార్హత బీకాం, సీఏ(ఇంటర్‌). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. చెన్నైలో ఓ ప్రముఖ హోటల్‌ గ్రూప్‌నకు ఫైనాన్షియల్‌ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు.. అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. బోగోల్‌ మండలం జెడ్‌పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు. బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. 2019లో నెల్లూరు లోక్‌ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు. రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు.

విజయసాయి రెడ్డి: వైఎస్సార్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి. విజయసాయి రెడ్డి. పూర్తి పేరు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి. 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జననం. చెన్నైలో చార్టెడ్‌ అకౌంటెంట్‌ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). అంతేకాదు.. రూల్స్‌, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు.

నిరంజన్‌ రెడ్డి: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఒకరు. జులై 22 1970 అదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణంలో జననం. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యంతా పూర్తి. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్‌. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్‌ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్‌ సీనియర్‌ కౌన్సిల్‌గా పలు కేసుల్లో కూడా సేవలందించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement