సాక్షి, విజయవాడ: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకోనుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు వేశారు. ఈ మూడు స్థానాలతో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరనుంది.
ఏప్రిల్ 2తో పూర్తికానున్న టీడీపీ సభ్యుడు ‘కనకమేడల’, వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌ల పదవీకాలం ముగియనుంది. ఈలోగా అంటే రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో ఎన్నికలు జరగాలి. కానీ పోటీగా ఎవరూ నామినేషన్లు వేయలేదు కాబట్టి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్‌సీపీ పరం కానున్నాయి.
రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. ఇక రాజ్యసభలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాల్లో ఘనవిజయం సాధించగా.. టీడీపీ 23 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.కాగా, తాజా ఎన్నికలతో రాజ్యసభలో టీడీపీ జెండా మాయమయినట్టయింది. పార్టీ ఏర్పడిన 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ సభ్యులు లేని పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ దీనస్థితికి ఇది నిదర్శనం. తన పార్టీకి బలం లేకున్నా.. చివరి వరకు ఓటుకు కోట్లు ఫార్ములా నమ్ముకున్న చంద్రబాబు.. ఆ ఎత్తులు పని చేయకపోవడంతో ఎన్నికల్లో అభ్యర్థిని దించే పని చెయ్యలేదు.
Comments
Please login to add a commentAdd a comment