ఓయూలో జరిగిన తెలంగాణ యూత్ డే సదస్సులో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
లాలాపేట: తుదిదశ తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు, యువత సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఐసీఎస్‌ఎస్‌ఆర్ హాల్లో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి, తెలంగాణ యూత్ డే సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ సమాజం స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కొరుకుంటోందని, ఇప్పుడు అవి రాష్ట్రంలో కొరవడ్డాయని అన్నారు.
సామాజిక న్యాయం లేని రాష్ట్రం రాష్ట్రమేకాదని పేర్కొన్నారు. చాలా ఏళ్ల తరువాత ఓయూలో తిరిగి తెలంగాణ చైతన్యం కన్పిస్తోందని, తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఓయూనే అని అన్నారు. ఉద్యమ ఆకాంక్షలను నెవరేరుస్తామని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1,200 మంది కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉద్యోగం, 3 ఎకరాల భూమి ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పాలకులు కేవలం 550 మందిని మాత్రమే గుర్తించి మిగతా వారిని విస్మరించారని, ఇంతకంటే అవమానం మరొకటి లేదని రేవంత్ అన్నారు.
తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి ఈ ప్రభుత్వానికి గుర్తేలేదని అన్నారు. ‘50 శాతం ఉన్న బలహీన వర్గాలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని, 12 శాతం ఉన్న మాదిగలకు కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం లేదని పేర్కొన్నారు. ఈ వర్గాలను అక్కున చేర్చుకుని సముచితమైన స్థానం కల్పించకపోతే మళ్లీ ఒకసారి తెలంగాణలో అలజడి రేగుతుందని, అందులో మీరు కాలి బూడిదై మసై పోతారని సీఎం చంద్రశేఖర్‌రావును హెచ్చరించారు. తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. నాడు ఖమ్మంలో కేసీఆర్ నిమ్మరసం తాగి పడుకుంటే గద్దరన్న ఓయూకు వచ్చి ఉద్యమాన్ని రగిలించారని పేర్కొన్నారు.
ఆంధ్రా కాంట్రాక్టర్లకు స్తూప నిర్మాణం
తెలంగాణ అమరవీరుల స్తూప నిర్మాణం కాంట్రాక్టును ఆంధ్రావాళ్లకు అప్పగించారని, ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇంకా అది పూర్తి కాలేదని రేవంత్ అన్నారు. తెలంగాణ సమస్యలపై మేధావులు ప్రణాళిక రూపొందించాలనీ, ఏం చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుందో చెప్పాలని, దాన్ని అమలు చేసే బాద్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తానే తీసుకుంటానని పేర్కొన్నారు.
తెలంగాణ సమాజం కేసీఆర్‌కు సర్వం ఇచ్చిందని, ఇక ఇచ్చేదేమీ లేదన్నారు. ఉద్యోగాల కోసం కేసీఆర్ వద్దకు వెళ్లకుండా తండ్రీకొడుకులైన కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు తీసేయాలని రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, గోవర్థన్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment