సాక్షి, హైదరాబాద్: ‘ముత్యాలముగ్గు సినిమాలో హీరోయిన్‌లా మారిపోయింది నా పరిస్థితి. ఆ సీన్‌లో నేను హీరోయిన్ అయితే హీరో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు. విలన్ రేవంత్‌రెడ్డి’అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. సీతమ్మ తరహాలోనే తనకు అగ్ని పరీక్ష చేసుకునే సమయం వచ్చిందని, అగ్నిపరీక్ష చేసుకుంటే కాలిపోతాను కనుక శీల పరీక్ష చేసుకుంటున్నానని అన్నారు.
పరీక్షలో భాగంగానే తనకు, రేవంత్ మధ్య జరిగిన విషయాలను.. రేవంత్, జగ్గారెడ్డి గుణగణాలను ప్రజలకు చెపుతున్నానని చెప్పారు. తాను చెబుతున్న విషయాలకు, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంగళవారం మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ‘కాంగ్రెస్‌కు నేను నష్టం చేస్తున్నానని కొన్ని రోజులుగా కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. నేను సోషల్ మీడియాలో వీక్ గనుక నా ఆవేదన, బాధ ప్రజలకు చెప్పుకోవాలి. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అర్థం కావాలి. దైవ సాక్షిగా చెపుతున్నా. నేను చెపుతున్నవన్నీ నిజాలే’అని చెప్పారు.
సంగారెడ్డి వెళ్తానని నాకు చెప్పనేలేదు
ఈ నెల 6న సీఎల్పీ సమావేశం జరిగిన రోజున రేవంత్ సంగారెడ్డికి వెళ్లి అక్కడి నుంచి మెదక్ వెళ్లారని, ఆ విషయం తనకు చెప్పలేదని జగ్గారెడ్డి అన్నారు. అంతకుముందు రోజు ఫోన్ చేసి తాను మెదక్ చర్చికి వెళ్తున్నానని, అక్కడి కార్యకర్తలకు చెప్పాలని చెప్పారే తప్ప తనను రమ్మనలేదని, సంగారెడ్డి వెళ్తున్నానని తనతో ప్రస్తావించలేదని అన్నారు. ఈ విషయాన్ని సీఎల్పీ సమావేశంలో రేవంత్‌తో మాట్లాడదామని అనుకున్నానని, కానీ కుసుమకుమార్ అక్కడేం మాట్లాడొద్దనడంతో సమావేశం నుంచి వెళ్లిపోయానని చెప్పారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకే రేవంత్ ఇలా చేశారంటే కార్యకర్తలు, ఇతర నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు.
సీఎల్పీ కార్యాలయంలో జరిగింది వేరు
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అనుకోకుండా సీఎల్పీ కార్యాలయానికి రేవంత్ వచ్చారని, ‘జగ్గన్నా’అని పలకరించడంతో తానూ ఆత్మీయంగా పలకరించానని జగ్గారెడ్డి చెప్పారు. ఆ తర్వాత ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకున్నామన్నారు. తర్వాతి రోజు పేపర్లలో తామిద్దరం కలిసినట్టు వార్తలు వచ్చాయని, కానీ లోపల జరిగింది వేరని చెప్పారు. మెదక్ విషయం, పార్టీ అంశాలేవీ తనతో రేవంత్ చర్చించలేదన్నారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని, ఏ క్షణమైనా ఏదైనా జరుగుతుందన్న సమాచారం ఉందని, అలర్ట్‌గా ఉండాలని రేవంత్ చెప్పారన్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితి అలా ఉంటే అసెంబ్లీ సజావుగా జరుగుతుందా అని ప్రశ్నించారు. రేవంత్ ఆలోచన అలా ఉంటుందని.. ఆయన పీసీసీ అధ్యక్ష పదవికి ఎలా అర్హుడవుతారో చెప్పాలన్నారు.
సస్పెండ్ చేసినా పార్టీపై గౌరవంతోనే ఉంటా
కాంగ్రెస్‌పై అభిమానం, గాంధీ కుటుంబంపై గౌరవంతోనే తాను పార్టీలో కొనసాగుతున్నానని, జీవితాంతం పార్టీలోనే ఉండాలని తాను కోరుకుంటున్నానని జగ్గారెడ్డి చెప్పారు. తనను సస్పెండ్ చేయించినా కాంగ్రెస్‌పై గౌరవంతోనే ఉంటానన్నారు. తనపై ఇతర కండువాలు కప్పుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే బాధపడనని చెప్పారు. శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి నేతలకూ వేరే పార్టీల కండువాలు కప్పుతున్నారని.. అలా చేసి ఏం చేయదల్చుకున్నారని ప్రశ్నించారు.
మంత్రి హరీశ్‌రావును కాంగ్రెస్ నేత వీహెచ్ కలిస్తే తప్పేంటని, ఆయనకూ అవినీతి మరకలు అంటిస్తున్నారని అన్నారు. ‘అరే, తురే’అని సంబోధించింనందుకే తనకున్న పదవుల్లో కోత పెడితే సోనియాను తిట్టిన రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రేవంత్ టీడీపీలో ఉండగా సోనియాను విమర్శించిన వీడియోను ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment