నేడో రేపో బీజేపీ మలి జాబితా | Sakshi
Sakshi News home page

నేడో రేపో బీజేపీ మలి జాబితా

Published Thu, Nov 2 2023 3:37 AM

Review at the BJP Central Election Committee meeting in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మలిజాబితాకు బీజేపీ అధిష్టానం ఆమోద ముద్ర వేసింది. తొలి జాబితా మాదిరిగా గెలుపు గుర్రాలే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం తయారు చేసిన మలి జాబితాలోని అన్ని స్థానాలపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూలంకషంగా సమీక్ష చేసింది.

అనంతరం మిగిలిన 66 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్న స్థానాలకు పచ్చజెండా ఊపింది. అయితే పొత్తు నేపథ్యంలో జనసేనకు కేటాయించే సీట్లను మినహాయించి మిగతా అభ్యర్థులతో బీజేపీ మలిజాబితా విడుదల కానుంది. సీట్ల కేటాయింపులో తొలి జాబితా మాదిరిగా మలి జాబితాలోనూ బీసీలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. 

చర్చల్లో మోదీ, నడ్డా, అమిత్‌ షా 
బుధవారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సీఈసీ సమావేశంలో తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజనాథ్‌సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్‌      సంతోష్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ సహా పలువురు కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సుమారు గంట పాటు కసరత్తు చేశారు.

వీరితో పాటు తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్ఢి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్‌ కుమార్, తరుణ్‌ ఛుగ్, సునీల్‌ భన్సల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జ్‌ అరవింద్‌ మీనన్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎన్నికల ఇంచార్జ్‌ ప్రకాశ్‌ జవదేకర్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కాగా తెలంగాణతో పాటు రాజస్తాన్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై విడి విడిగా ఆయా రాష్ట్రాల నాయకులతో కలిసి కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించి ఆమోద ముద్ర వేసింది. 

పూర్తిస్థాయిలో కసరత్తు 
తెలంగాణకు సంబంధించి బీజేపీ తొలి జాబితా విడుదల తర్వాత కొన్నిచోట్ల అసంతృప్త స్వరాలు బయటపడడం, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి సహా పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో చేరిన పరిణామాల నేపథ్యంలో మలిజాబితాపై రాష్ట్ర నా యకత్వం పూర్తిస్థాయిలో కసరత్తు నిర్వహించింది.  

బీసీలకే పెద్దపీట: కాగా తొలి జాబితాలో ఏవిధంగా అయితే బీసీలు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారో.. మలి జాబితాలోనూ బీసీలు, మహిళలకు సముచిత స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల తెలంగాణ పర్యటనలో ప్రకటించిన నేపథ్యంలో బీసీలకు పెద్దపీట వేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఏ క్షణమైనా జాబితా 
కాగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన బీజేపీ అభ్యర్థుల మలిజాబితాను ఢిల్లీ నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశాలున్నాయి. గతంలో తొలి జాబితా విడుదల సమయంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అక్టోబర్‌ 20వ తేదీన జరుగగా, 52 మంది సభ్యుల జాబితాను అక్టోబర్‌ 22 న విడుదల చేశారు. ఈసారి కూడా అదే తరహాలో ఒకటి రెండు రోజుల తర్వాత మలి జాబితాను విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement