సాక్షి, విజయవాడ : ఫైబర్ గ్రిడ్ స్కామ్‌లో టీడీపీ నేత నారా లోకేష్ బాబు అడ్డంగా దొరికిపోయారని ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. తండ్రి శాఖలో ఫైల్‌పై లోకేష్ ఎందుకు సంతకం పెట్టారని ఆమె ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫైబర్ గ్రిడ్ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమరావతిలోనూ చంద్రబాబు, లోకేష్‌లు భారీ కుంభకోణం చేశారన్నారు. అమరావతిలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. టీడీపీ నేతలు, ఓ సామాజికవర్గం వాళ్లే అక్కడ భూములు ఎందుకు కొనగలిగారని ప్రశ్నించారు. అమరావతి చంద్రబాబుకి ఏటీఎం అని ప్రధాని మోదీనే చెప్పారని, అందుకే ప్రధాని మోదీని సీబీఐ విచారణ వేయాలని కోరుతున్నామన్నారు. ( స్టేలతో బతుకుతున్న వ్యక్తి చంద్రబాబు )
ఆమె తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ సీఎం వైఎస్ జగన్ అనేక సార్లు తిరుమల వెళ్లారు. ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ అంటూ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్‌ని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు. 40 గుళ్లను కూలగొట్టి, బూట్లతో పూజలు చేసిన వ్యక్తి బాబు. సీఎం జగన్ కాలినడకన తిరుమల కొండకు వెళ్లారు. పాదయాత్రకు ముందు, ప్రమాణ స్వీకారానికి ముందు తిరుమలలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ప్రధాని మోదీతో కలిసి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు. ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు. ముఖ్యమంత్రి మతాలకు, కులాలకు అతీతమైన నాయకుడు. అన్ని మతాలు, కులాలు ఆయనను నమ్మాయి కాబట్టే 151 సీట్లతో గెలిపించార’’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment