
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ఇస్తుందని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న విషయం ఉద్యోగులకు తెలియంది కాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు మేలు చేయాలన్న ధృక్పథంతోనే ఉన్నారని, ప్రస్తుతం 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి) ఇస్తున్నామని, ఇప్పుడు వస్తున్న గ్రాస్ వేతనం ఏమాత్రం తగ్గకుండా పీఆర్సీ ఉంటుందని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన తర్వాతే పీఆర్‌సీపై ప్రకటన ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సజ్జల గురువారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలసి ఉద్యోగ సంఘాలతో చర్చల వివరాలను తెలియచేశారు. అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల విలేకరులతో మాట్లాడారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చొద్దు..
రాష్ట్ర సొంత ఆదాయానికి మించి 111 శాతం ఉద్యోగుల వేతనాలకే ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. వీటిని దృష్టిలో ఉంచుకునే సీఎస్ నేతృత్వంలోని కమిటీ 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సిఫార్సు చేసిందన్నారు. దీనిపై ఇతర రాష్ట్రాలతో పోల్చుకునే పరిస్థితి లేదన్నారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన వెంటనే అడగకుండానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన 71 అంశాలతో పాటు డీఏ అంశాన్ని నిర్దేశిత కాల వ్యవధిలోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment