మీడియాతో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి
కడప కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో హాస్యాస్పదంగా.. 420 వ్యవహారంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఐదేళ్లూ అధికారంలో ఉండి చేయలేని పనులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే చేస్తామనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికలపై కడపలో వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తన పరిధిలో లేనివి, తాను చేయలేనివన్నీ మేనిఫెస్టోలో పెట్టి విడుదల చేయగా లోకమంతా నవ్విపోయిందన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మరో మేనిఫెస్టో విడుదల చేయడం మోసగాళ్లు చేసే పని అని ధ్వజమెత్తారు.
పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోపై కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే ఇప్పుడు కూడా పెట్టారన్నారు. అప్పటి ఎన్నికల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్, ఒక వ్యక్తికి 20 లీటర్ల నీరు అంటూ హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. తాజాగా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేరని, చేసే అవకాశం కూడా లేదని అన్నారు.ప్రజలు ఎంతో అమాయకులుగా చంద్రబాబు భావిస్తున్నారనే విషయం దీన్ని బట్టే తెలుస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పునాదులతో సహా కుప్పకూలిపోయిందని, తమ కోటలాగా భావించే కుప్పం బద్దలైపోయిందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిలా అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో టీడీపీ వాళ్లకే అర్థం కావడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి కుటుంబానికి పెద్దగా వారి బాగోగులు ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇది ప్రజల హృదయాలకు ఆయనను దగ్గర చేసిందన్నారు. మరో మూడేళ్లు ఏ ఎన్నికలు లేవని, టీడీపీ దుకాణం మూసుకోవాల్సిందేనన్నారు. టీడీపీ నిజమైన ప్రతిపక్షంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, కానీ వారు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని అన్నారు. తండ్రికి వయసై పోయిందని.. కొడుకు లోకేశ్ అయినా నేర్చుకుంటాడనుకుంటే అదీ లేదన్నారు. నోటికొచ్చినట్లు తిట్టుకుంటూ పోతే వారి ఖర్మ అని వదిలేయడం తప్ప మరేం చేయలేమన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment