సాక్షి, అమరావతి: చంద్రబాబు ఏజెంట్‌గా మారిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ప్రశ్నిస్తే తప్పేంటని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిమ్మగడ్డ, చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటే.. తాము మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. తాను ప్రభుత్వ సలహాదారుకన్నా ముందు పార్టీ ప్రధాన కార్యదర్శినని గుర్తుచేశారు. నిమ్మగడ్డ టీడీపీ ఆఫీసులో కూర్చుని తనపై విమర్శలు చేయాలని హితవు పలికారు. రాచరిక ధోరణిలో నియంత పోకడలు పోతే ఊరుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఎన్నికలను హింసాత్మకంగా మార్చాలన్న చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నాడు. రాచరికాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇది తీవ్ర అభ్యంతరకరం. ఆక్షేపణీయం. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, సంయమనంతో ఏ కఠిన నిర్ణయం తీసుకున్నా ఎవరైనా స్వాగతిస్తారు. గతంలో ఎన్నికల సంస్కరణలు తెచ్చిన మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ శేషన్ కూడా పరిధి దాటి వెళ్లలేదు. అంతెందుకు నిమ్మగడ్డ దాడిచేస్తున్న గోపాలకృష్ణ ద్వివేది కూడా హుందాగా వ్యవహరించారు. చంద్రబాబు బెదిరించినా, చులకన చేసినా ఆవేశపడలేదు. నిమ్మగడ్డ మాత్రం విశృంఖలంగా, జుగుప్సాకరంగా, తనపైతానే అదుపుతప్పుతున్నారు. తోటి అధికారులను దూషించి, సంస్కారహీనుడిగా రుజువయ్యారు.
చంద్రబాబు కుట్రకు నిమ్మగడ్డ సహకారం
నిమ్మగడ్డ కోవిడ్‌ను కారణంగా చూపి మార్చి 15న స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశాడు. ఇలా చెప్పిన వ్యక్తి మార్చి 18న కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో వికృతరూపం చూపించారు. ఇన్ని ఏకగ్రీవాలు ఎలా అయ్యాయంటాడు. గతం కన్నా మొన్న స్థానికసంస్థల ఎన్నికల్లో హింస తగ్గిందని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. 2019 ఎన్నికల్లో వైస్సార్‌సీపీ 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు గెలిచింది. రాష్ట్రం మొత్తం జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కడితే.. ఏడాదికిపైగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. ఏకగ్రీవాలు రావడంలో ఆశ్చర్యమేంటి? ఆగిపోయిన ఎన్నికల నుంచే మళ్లీ మొదలు పెడతానన్న వ్యక్తి, పంచాయతీ ఎన్నికలను ముందుకు తేవడంలో కుట్ర ఏంటి? హింసను ప్రేరేపించి, తర్వాత పారీ్టపరంగా జరిగే ఎన్నికలపై ఈ ప్రభావం ఉండేలా చెయ్యాలన్న చంద్రబాబు కుట్ర కాదా? దీనికి నిమ్మగడ్డ సహకరించడం లేదా?
టీడీపీ గూండాలతో ఎన్నికలు జరుపుతావా?
మేం అధికారంలోకొచ్చిన తర్వాత నిమ్మగడ్డ ఆరోపణలు చేయని అధికారులున్నారా? వ్యతిరేకించని శాఖలున్నాయా? పేరు ప్రస్తావించకపోయినా సాక్షాత్తూ ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేశారు. డీజీపీ, చీఫ్ సెక్రటరీ, అధికారులు, ఉద్యోగసంఘాలు అందరిమీదా దాడే. అసలు ఈ యంత్రాంగాన్ని కాదని.. తెలుగుదేశం కార్యకర్తలు, గూండాలు, చంద్రబాబు ఏజెంట్లతో ఎన్నికలు జరుపుతారా? ఇదేమన్నా మీ సొంత రాజ్యాంగమా? దీన్ని ప్రశ్నిస్తే నిమ్మగడ్డకు ఆగ్రహం. అందరినీ డిస్మిస్ చెయ్యమంటాడు. సొంత ఏజెంట్లను పెట్టుకుని రహస్య విచారణ జరిపి ప్రవీణ్‌ప్రకాష్ తప్పు చేశాడని చెబుతాడు. ఇలాచేసే అధికారం నిమ్మగడ్డకు ఎక్కడిది? 2018 నుంచి ఎన్నికలు జరపని నేరం నిమ్మగడ్డ, చంద్రబాబులది కాదా? ఇప్పుడు నీతులు చెబితే ఎలా? నిమ్మగడ్డ ఒక జోకర్, బఫNన్‌గా వచ్చి పోతారంతే. అధికారులపై గతంలో ఉన్న కక్ష తీçర్చుకుంటారంతే. ఆ తర్వాత అధికారంలో ఉండేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. జగన్‌మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి. కానీ చంద్రబాబును నమ్ముకుని నిమ్మగడ్డ నవ్వులపాలవుతున్నారు.
నేను ముందే పార్టీ వ్యక్తిని
ప్రభుత్వ సలహాదారు కాకముందు నేను పార్టీ ప్రధాన కార్యదర్శిని. ప్రభుత్వంలో ఉంటే రాజకీయంగా మాట్లాడకూడదా? నిమ్మగడ్డకు ఏదనిపిస్తే అది అంటాడు. టీడీపీ ఆఫీసులో కూర్చుని నన్ను తిడితే ఫర్వాలేదు. ఎన్నికల కమిషన్ ఆఫీసులో కూర్చుని రాజకీయ పార్టీలో ఎవరుండాలి? ఎక్కడ కూర్చుని మాట్లాడాలి? అనే నిర్ణయాధికారం నిమ్మగడ్డకు లేదు. చంద్రబాబునాయుడి తమ్ముడిగా, ఆయన ప్రయోజనాలు, ఓ చిన్నవర్గాన్ని కాపాడే వ్యక్తిగా వ్యవహరించారు కాబట్టే ప్రశ్నించాం. మళ్లీమళ్లీ ప్రశ్నిస్తాం. కానీ తిట్టం. అయినా టీడీపీ వాళ్లు నిమ్మగడ్డ నోటికొచ్చినట్టు వాగితే నోర్మూసుకోవాలా? నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణ తీరుపై మాకు అనుమానాలున్నాయి. మా కార్యకర్తలపై ఆయన కేసులు పెట్టొచ్చు. టీడీపీకి మేలు చేస్తారని తెలుసు. అందుకే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం.
మోసగాడి మేనిఫెస్టో
చంద్రబాబు 200 శాతం మోసగాడే. టీడీపీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో పచ్చిమోసం. వందగజాల్లో రూ.3 లక్షలతో ఇల్లు కట్టడం, ఆస్తిపన్ను 50 శాతం తగ్గించడం పంచాయతీల పరిధిలో ఉంటుందా? ఆయన మతితప్పి మేనిఫెస్టో ఇవ్వలేదు. ప్రజలను మోసం చేయడానికే. అసలీయనకు మేనిఫెస్టో అంటే గౌరవం ఉందా? 2014 మేనిఫెస్టోలో 600కు పైగా హామీలిచ్చి.. అమలు చేయలేదని జనం నిలేస్తారని దాన్ని వెబ్‌సైట్‌లోంచే తీసేశాడు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. మేధావులు, ప్రజల్లోను చర్చ జరగాలి. పరిధిలేని పంచాయతీల్లో ఇలాంటి హామీలివ్వడం నేరమా.. కాదా? ఎవరైనా క్రిమినల్ కేసులు వేయాల్సిన అవసరమూ ఉంది. ప్రజలూ ఈ మోసాన్ని ప్రశ్నించాలి..’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment