బాధితులనే వేధిస్తారా? | Sajjala Ramakrishna Reddy Comments On YS Viveka Case Issue | Sakshi
Sakshi News home page

బాధితులనే వేధిస్తారా?

Published Wed, Feb 16 2022 4:35 AM | Last Updated on Wed, Feb 16 2022 10:35 AM

Sajjala Ramakrishna Reddy Comments On YS Viveka Case Issue - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు చేసిన కుట్ర కంటే.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీని, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ నేతలు దారుణమైన కుట్రలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌.. బాధితులనే నిందితులుగా చిత్రీకరించేందుకు దురుద్దేశపూరితం, ప్రేరేపితం, ముందే నిర్ణయించిన విధంగా చార్జ్‌షీట్‌ రూపొందించారని స్పష్టం చేశారు. సత్యదూరమైన ఈ సీబీఐ చార్జ్‌షీట్‌ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బ్యానర్‌గా కథనాన్ని ప్రచురించడానికి,  ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5 ఛానళ్లలో కథనాలు ప్రసారం చేసుకునేందుకు మాత్రమే పనికొస్తుందన్నారు. హేతుబద్ధత లేకుండా సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

సత్యదూరం.. అసంబద్ధ కథనం..
నేను ఇవాళ ఒక ప్రభుత్వ సలహాదారుడిగా కాకుండా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా. వైఎస్‌ వివేకానందరెడ్డిని అభిమానించే వ్యక్తిగా మాట్లాడుతున్నా. వివేకా హత్య కేసులో వాస్తవాలను విస్మరించి సత్యదూరమైన, అసంబద్ధమైన కథనం సీబీఐ చార్జ్‌షీట్‌ పేరుతో వచ్చింది. ఎన్నికల ముందు 2019 మార్చి 15న వైఎస్‌ వివేకా హత్యకు గురికావడం వైఎస్సార్‌సీపీని కుదిపేసింది. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, తన చిన్నాన్న అయిన వైఎస్‌ వివేకా హత్యకు గురికావడం వైఎస్‌ జగన్‌ను కుంగదీసింది. ఈ హత్య కచ్చితంగా రాజకీయ అంశంతో ముడిపడిందని అనుకున్నాం. అందుకు తగిన ఆధారాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

ఆ హత్యతో నష్టపోయింది పార్టీనే
వైఎస్‌ వివేకా హత్య అనంతరం గంటల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలు, వరుసగా బయటకు వచ్చిన వార్తల వల్ల గందరగోళానికి కారణాలను అన్వేషిస్తే సమాధానం దొరుకుతుంది. వైఎస్సార్‌సీపీలో కీలకంగా వ్యవహరిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటూ వైఎస్‌ జగన్‌ను సీఎం చేయడానికి శాయశక్తులా పని చేసిన నాయకుడు హఠాత్తుగా చనిపోవడం వల్ల ఎవరికి నష్టం? ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు, పులివెందుల నియోజకవర్గానికి నష్టం. 

హత్యకు మించి కుట్రలు, కుతంత్రాలు
సీబీఐ చార్జ్‌షీట్‌ చూస్తే అది ఒక కథనంలా వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉంది. వివేకా హత్యకు గురికావడం వైఎస్సార్‌ కుటుంబానికి, పార్టీకి ఎంతో నష్టం కలిగిస్తే.. ఇప్పుడు  హత్యను ఆ కుటుంబంలోని వారే చేశారని చెప్పడానికి ప్రయత్నించడంతో పాటు సంబంధం లేని వారిని కలపడానికి అభూత కల్పనలు సృష్టించి సీబీఐ ఛార్జ్‌షీట్‌ రూపొందిస్తే.. టీడీపీ మీడియా అందుకోవడం, హైలైట్‌ చేయడం.. ఇదంతా ఒక సమన్వయంతో జరిగినట్లు కనిపిస్తోంది. దీన్నిబట్టి ఇది పూర్తిగా దురుద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా చేసినట్లు కనిపిస్తోంది. ఆరోజు వైఎస్‌ వివేకా హత్యకు ఎలా కుట్ర చేశారో ఇప్పుడు అంతకుమించి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది.

శివప్రకాష్‌రెడ్డి చెబితేనే అవినాష్‌కు తెలిసింది..
వైఎస్‌ వివేకా గుండెపోటుతో మృతిచెందారని ఆయన బంధువు శివప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేస్తే  జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న వైఎస్‌ అవినాష్‌రెడ్డి వెనక్కి వచ్చి వివేకా ఇంటికి చేరుకున్నారు. ఆయన వెంట శంకర్‌రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయనా వివేకా ఇంటికి వచ్చాడు. మరి వైఎస్‌ అవినాష్‌రెడ్డికి శివప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేశాడంటే విషయం ముందుగా ఎవరికి తెలిసింది? అసలు వైఎస్‌ వివేకాకు గుండెపోటు వచ్చి మరణించాడన్న మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు బీజేపీ నాయకుడిగా ఉన్న ఆదినారాయణరెడ్డి 2019 డిసెంబర్‌లో సిట్‌ విచారణలో వివేకా బంధువు శివప్రకాష్‌రెడ్డే తనకు ఫోన్‌ చేసి చెప్పారని వెల్లడించారు (అందుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు). విషయం అంత క్లియర్‌గా ఉంటే సీబీఐ ముందుగానే సిద్ధం చేసుకున్నట్లుగా వైఎస్‌ అవినాష్‌ను నిందితుడిగా చేరుస్తూ ఛార్జ్‌షీట్‌ రూపొందించింది. అందుకే దాన్ని చూడగానే షాక్‌కు లోనయ్యాం. వివేకా గుండెపోటుతో మరణించారని తొలుత చెప్పిన శివప్రకాష్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించకపోవడంలో ఔచిత్యమేంటి?

ఆ లెటర్‌ ఎందుకు బయట పెట్టలేదు?
వైఎస్‌ వివేకా పీఏ కృష్ణారెడ్డికి ఒక లెటర్‌ దొరికితే దాన్ని ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి పక్కన పెట్టించారు. దాన్ని ఎవరికీ చూపలేదు. వైఎస్‌ అవినాష్‌రెడ్డికి కానీ, సీఐకి కానీ చూపలేదు. చూపించి ఉంటే అప్పుడే అన్నీ తెలిసేవి. వివేకా మరణం సహజం కాదు. దారుణ హత్య. పక్కా ప్రణాళికతో చేసిన హత్య అన్నది ఆ లేఖ ద్వారా తేలిపోయేది. కానీ అందుకు భిన్నంగా కొందరిని ఇరికించడానికి ఆ లేఖను మాయం చేశారు. అదే యోచనతో సీబీఐ ఛార్జ్‌షీట్‌ తయారు చేసినట్లు ఇప్పుడు స్పష్టమవుతోంది. తనను చంపుతున్నట్లు వైఎస్‌ వివేకా రాశారని చెబుతున్న ఆ లెటర్‌ను ఆ రోజు సాయంత్రం వరకూ ఎందుకు బయటపెట్టలేదు?

తుడిచింది గంగిరెడ్డి తదితరులే..
వైఎస్‌ అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డి... వైఎస్‌ వివేకా ఇంటికి వెళ్లక ముందే ఎర్ర గంగిరెడ్డి తదితరులు రక్తపు మరకలను తుడిచి ఇంటిని శుభ్రం చేశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డితోపాటు చాలా మంది అప్పటికి ఆయన ఇంట్లో ఉన్నారు. అవినాష్‌రెడ్డి వివేకా ఇంటికి చేరుకున్నాక సీఐ శంకరయ్యకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. దాంతో సీఐ శంకరయ్య అక్కడికి చేరుకున్నారు. వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉంటే రక్తపు మరకలు తుడిచిన వారిని కాదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వైఎస్‌ అవినాష్‌రెడ్డిని చేర్చడంలో మర్మమేమిటి?

వివేకా–సునీతమ్మ మధ్య గొడవల మాటేంటి?
వైఎస్‌ వివేకా, కుమార్తె సునీతమ్మల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆయన ఇంటి సమీపంలో ఉన్న వారందరికీ తెలుసు. సీబీఐ దర్యాప్తులో ఈ అంశంపై కనీసం దృష్టి కూడా సారించిన దాఖలాలు కనిపించకపోవడంలో ఔచిత్యమేంటి?

నిష్పాక్షిక దర్యాప్తు కోరుకున్నాం
2020 మార్చిలో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగితే, అదే ఏడాది మే 30 వరకు టీడీపీనే అధికారంలో ఉంది. అప్పుడు ఉన్న అధికారులే వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత చాలా కాలం ఉన్నారు. కేసు సీబీఐకి అప్పగించాలని కోరితే సీఎం జగన్‌ వెంటనే ఒప్పుకున్నారు. ఎక్కడా ఏదీ దాచుకోలేదు. కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని కోరుకున్నారు. 

అంతా విచిత్రం..:
కేసును 2020 మార్చిలో సీబీఐకి అప్పగిస్తే ఇప్పుడు కీలక ఘట్టానికి చేరింది. ఆ రోజు ఫిర్యాదు చేసిన కృష్ణారెడ్డి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ తనను దారుణంగా వేధిస్తున్నారని, వివేకా హత్య కేసులో శంకర్‌రెడ్డి, ఆయన అనుచరుల పేర్లు చెప్పమని వేధిస్తున్నారని వెల్లడించారు. సీఐ శంకరయ్యను బెదిరించారని చెప్పారు. ఎస్పీ రాంసింగ్‌ తనను బెదిరిస్తున్నట్లు మంగళవారం ఉదయ్‌ చెప్పాడు. గంగిరెడ్డి కూడా ఇదే అంశాన్ని చెప్పాడు. శంకర్‌రెడ్డి రక్తాన్ని తుడవమన్నాడని.. గంగిరెడ్డి ఇతరులు హత్య చేశారని. వీళ్ల వెనక పెద్దలు ఉన్నారని. ఇదంతా చెప్పింది దస్తగిరి అని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో రాశారు. 

హైకోర్టు ఆదేశాలకు సీబీఐ తూట్లు..
వివేకాది దారుణహత్య. ఎర్ర గంగిరెడ్డి చంపించాడని, తానే చంపానని దస్తగిరి స్పష్టంగా చెబుతుంటే అవన్నీ వదిలేసి అసలు సంబంధం లేని వారిని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చడం షాకింగ్, దురదృష్టకరం. హైకోర్టు ఏ ఉద్దేశంతో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించిందో దానికి తూట్లు పొడిచారు. నిష్పాక్షిక దర్యాప్తు జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టిన వైఎస్‌ వివేకాను వైఎస్సార్‌సీపీ గెలిపించుకోవాలని చూస్తుందా? లేక ఓడిపోవాలని పని చేస్తుందా? నిజానికి పార్టీకి అక్కడ మంచి మెజారిటీ కూడా ఉంది. అలాంటప్పుడు వివేకాను ఓడించడానికి శంకర్‌రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తాడు. ఆనాడు బీటెక్‌ రవి ఎలా గెల్చాడు? వైఎస్సార్‌సీపీ ఓట్లను ఎలా లాక్కున్నారనే అంశాలను ఇవాళ సీబీఐ చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నిక 2017లో జరిగితే వివేకా హత్య  2019లో జరిగింది. మరి రెండింటినీ ఎలా కలుపుతారు?

ఐదేళ్లు గాడిదలు కాశారా?
జైలర్‌ వరుణారెడ్డి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో ఒక జైలులో పని చేస్తున్నప్పుడు మొద్దుశీను హత్య జరిగిందని, ఇప్పుడు ఆయనను కడప జైలుకు బదిలీ చేశారంటే వివేకా హత్య కేసులో నిందితులను చంపడానికే అంటూ టీడీపీ దిగజారుడు విమర్శలు చేస్తోంది. నిజంగా ఆ జైలర్‌ మొద్దుశీనును చంపించి ఉంటే 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్నప్పుడు చర్యలు తీసుకోకుండా గాడిదలు కాశారా? 

ఛార్జ్‌షీట్‌ను ఎదుర్కొంటాం
పైశాచిక స్వభావం ఉన్న టీడీపీ నాయకుల ముఠా సమన్వయంతో వ్యవస్థలను మేనేజ్‌ చేస్తోంది. అన్యాయంగా ఒక యువ ఎంపీని కేసులో ఇరికిస్తున్నారు. కచ్చితంగా అన్నీ ఎదుర్కొంటాం. చార్జ్‌షీట్‌ను కచ్చితంగా సవాల్‌ చేస్తాం. 

ఈ ప్రశ్నలకు జవాబేది?
► హత్య విషయం ఎవరికి ముందు తెలిసింది? ఎవరు, ఎవరికి చెప్పారు?
► ఆ లేఖను అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు?
► ఘటనా స్థలానికి ముందు సీఐ వచ్చారు. నిజానికి సీఐని అక్కడికి పంపించింది అవినాష్‌రెడ్డి. నిజంగా ఆయన ఆ హత్య చేయించి ఉంటే ఫోన్‌ చేసి సీఐని ఘటనా స్థలానికి పంపిస్తారా?

అవినాష్‌ గెలుపు కోసమే వివేకా ప్రచారం
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎంపిక చేసేది అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ వివేకా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిత్వాన్ని ఆశించలేదు. వైఎస్‌ జగన్‌ను సీఎంగా చేయడం కోసం అప్పటికే కడప ఎంపీగా ఉన్న వైఎస్‌ అవినాష్‌ను మళ్లీ గెలిపించాలని వైఎస్‌ వివేకా ప్రచారం చేస్తున్నారు. కడప నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. హత్యకు గురికావడానికి ముందు రోజు కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్‌ వివేకా ప్రచారం చేశారు.

వైఎస్‌ జగన్‌ను సీఎంను చేయడం కోసం, కడప ఎంపీగా అవినాష్‌ను గెలిపించడం కోసం వివేకా విస్తృతంగా ప్రచారం చేశారని ఆయన హత్య తర్వాత మార్చి 27న ఆయన కుమార్తె సునీతమ్మ కూడా చెప్పారు (అందుకు సంబంధించిన ఆ వీడియోను కూడా ప్రదర్శించి చూపారు). ఇలాంటి పరిస్థితుల్లో తనకు వైఎస్‌ వివేకా టికెట్‌ రానివ్వడని వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఎలా అనుకుంటారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో అలా పేర్కొనడంలో ఆంతర్యమేమిటి? ఎల్లో మీడియా వాటి ప్రయోజనాల కోసం రాసి ఉండవచ్చు అనుకోవచ్చు. కానీ జాతీయస్థాయిలో పేరు పొందిన సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో ఎలా రాస్తుంది? (ఛార్జ్‌షీట్‌లోని అంశాలను మరోసారి సజ్జల చదివి వినిపించారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement