సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సవాలు విసిరే అర్హత చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్‌ను విమర్శించే నైతిక హక్కు బాబుకు లేదని స్పష్టంచేశారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. 2014 –19 మధ్య బాబు పాలన అంతా వంచనతోనే సాగిందని చెప్పారు. చంద్రబాబుది చెత్త పాలనే అని ఆయన దత్తపుత్రుడు పవనే 2018లో చెప్పాడన్నారు.
బాబు అవకతవకలను తాము బయటపెడుతూనే ఉంటామని చెప్పారు. సీఎం జగన్‌పైన, ప్రభుత్వంపైన పచ్చి అబద్ధాలతో పచ్చ పత్రికల్లో తప్పుడు కథనాలు అచ్చేయించి, గోబెల్స్ ప్రచారం చేసి వాటిపై చర్చకు రమ్మంటే రావాలా అంటూ మండిపడ్డారు. బాబు అధికారంలోకి రారు కాబట్టి ఎన్ని ఛాలెంజ్‌లైనా చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కారు కూతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం జగన్ వదిలేశారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిపై బాబు అడుగుతున్నారు కాబట్టి చర్చకు తాము సిద్ధమేనన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలకు సరైన వేదిక శాసన సభ అని, చంద్రబాబు ఆ సభకే రాకుండా వెళ్లిపోయారని అన్నారు. చంద్రబాబు అడిగారు కాబట్టి చర్చకు తమ వాళ్లను పంపుతామన్నారు.
ప్రజలు మరోసారి చంద్రబాబుకు బుద్ధి చెబుతారు
సిద్ధం సభలకు జన స్పందన చూస్తే సీఎం వైఎస్ జగన్‌కు ఉన్న ప్రజాదరణ అర్థమవుతుందని తెలిపారు. చంద్రబాబు సభలు ఎందుకు నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలీదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌కు ప్రజాదరణ లేదని బాబు భావిస్తే పొత్తుల కోసం పాకులాడటం దేనికని, ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా అని నిలదీశారు. ఏం చూసి చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారని అన్నారు. అధికారంపై చంద్రబాబువి పగటి కలలేనని చెప్పారు. ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలంతా సీఎం జగన్ వైపే ఉన్నారని, ఈసారి కూడా వైఎస్సార్‌సీపీ ఘన విజయం తథ్యమని స్పష్టం చేశారు. రోజూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే రామోజీకి కూడా చంద్రబాబు అధికారంలోకి రారని తెలుసునని చెప్పారు.
సంక్షేమ పథకాల అమలు వాస్తవం కాదా?
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రపంచమంతా తెలుసునని చెప్పారు. టీడీపీ వారే దొంగ ఓట్లు చేర్చి వైఎస్సార్‌సీపీకి ఆపాదిస్తున్నారని తెలిపారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే చంద్రబాబు జైలుకెళ్లారని, రకరకాల జబ్జులు ఉన్నాయని గగ్గోలు పెట్టి, బెయిల్ పొందారని అన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి చంద్రబాబు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకే బాబు ప్రయత్నిస్తున్నారని, కానీ వారు ఆయన అనుకున్నంత అమాయకులు కాదని అన్నారు. నారా లోకేశ్ ఏం మాట్లాడుతున్నారో అతనికే తెలీదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
ఇలా ఓట్లడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా?
గత 57 నెలల్లో అందించిన సంక్షేమాన్ని చూసి ఓటు వేయమని సీఎం జగన్ అడుగుతున్నారన్నారు. గత 57 నెలల్లో రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు రూ.2.55 లక్షల కోట్లను డీబీటీ రూపంలో వారి ఖాతాల్లో నేరుగా జమ చేసింది వాస్తవం కాదా అని అన్నారు. సీంఎ జగన్ మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చారని తెలిపారు. దశలవారీగా మద్య పాన నియంత్రణ, సీపీఎస్ రద్దు ఎందుకు చేయలేదో సహేతుకమైన కారణాలను చెప్పామన్నారు.
మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. ఇలా ఏం చేశామో చెప్పుకొని ధీమాగా ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదన్నారు. అందుకే సీఎం జగన్‌ను తిట్టడం తప్పిస్తే ఆయన ఏదీ మాట్లాడటం లేదని, నోరు తెరిస్తే తిట్లు, బూతులే అని అన్నారు. అధికారంలోకి రారని తెలిసి అడ్డగోలుగా హామీలిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు తెలిసింది మోసం చేయడం ఒక్కటేనని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ గొప్పదని తాము గర్వంగా చెబుతున్నామన్నారు. జన్మభూమి కమిటీలు అత్యుత్తమం అని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment