ఢిల్లీ, సాక్షి: స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఈ క్రమంలో.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్ పిటిషన్‌ను బదిలీ చేసింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు భారీ షాక్ లాంటిది. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టు అంటే విజయవాడలోని ACB కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
తీర్పు ఎలా వెలువరించారంటే..
తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు.
ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చదువుతూ.. "ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్‌ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు." అని జస్టిస్ బోసు తీర్పు ఇచ్చారు.
జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు.
మొదటి తీర్పు : జస్టిస్ బోస్ ఏమన్నారంటే..
- ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది
- చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది
- గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు
- చంద్రబాబు కేసులో 13(1)(c), 13(1)(d), 13(2) వర్తించవు
- అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్‌ను కొట్టేయలేం
- కేవలం అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు
- రిమాండ్ రిపోర్ట్‌ను కొట్టేయాలని గానీ, చెల్లుబాటు కాదని గానీ చెప్పలేం, రిమాండ్ చెల్లుతుంది, కొనసాగుతుంది
రెండో తీర్పు : జస్టిస్ బేలా త్రివేది ఏమన్నారంటే..
- అసలు ఈ కేసులో చంద్రబాబు పిటిషన్‌కు ఏ రకంగా 17ఏ వర్తించదు
- 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం
- పాత కేసులకు 17ఏ వర్తించదు, సవరణ వచ్చిన తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెక్షన్ వర్తిస్తుంది.. కానీ చంద్రబాబు కేసుకు వర్తించదు
- 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే
- అవినీతి నిరోధక చట్టం కింద నమోదయిన ఈ కేసును 17ఏకి ముడిపెట్టి ఊరట ఇవ్వలేం
- అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు
- అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే
- గవర్నర్ అనుమతి లేదనే కారణంతో FIRను క్వాష్ చేయడం కుదరదు
- ట్రయల్ కోర్టు (ACB కోర్టు, విజయవాడ) ఇచ్చిన రిమాండ్ పూర్తిగా సబబే
- దర్యాప్తు కొనసాగించవచ్చు, ఛార్జ్‌షీట్ దాఖలు చేయవచ్చు, న్యాయప్రక్రియ కంటిన్యూ అవుతుంది
- ఇలాంటి కేసుల్లో 17ఏను అంగీకరిస్తే.. మొత్తం న్యాయప్రక్రియ అపహస్యం అవుతుంది
- పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులకు ఇదే వర్తిస్తుందన్న వాదన మొదలవుతుంది
- అసలు 17ఏ వర్తించాలన్న వాదనే సరికాదు, దీని పర్యవసానాలు ఊహించనంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకువస్తాయి
- దర్యాప్తు అధికారులకు పూర్తి అధికారాలున్నాయి, అవినీతి నిరోధక చట్టం కింద విచారణ కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు
- నిజాయితీపరుల రక్షణ కోసమే ఈ సవరణ తీసుకొచ్చామన్నది పార్లమెంట్ చర్చల సారాంశం
ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే..!
- సెప్టెంబర్ 22వ తేదీన ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత..
- సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్
- సెప్టెంబర్ 25వ తేదీన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు బాబు క్వాష్ పిటిషన్
- 26న సంబంధిత న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ఉన్నందున మరుసటి రోజుకి వాయిదా
- జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్‌ల ధర్మాసనం ముందుకు సెప్టెంబర్ 27వ తేదీన బాబు క్వాష్ పిటిషన్
- ధర్మాసనం నుంచి వైదొలగిన జస్టిస్ భట్
- మరోసారి సీజేఐ చంద్రచూడ్ ముందుకు పిటిషన్
- అక్టోబర్ 3న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు పిటిషన్
- అక్టోబర్ 9,10,13వ తేదీల్లో వాడీవేడిగా సాగిన వాదనలు
- అక్టోబర్ 13వ స్కిల్ పిటిషన్‌కు తోడైన ఫైబర్ గ్రిడ్ కేసు పిటిషన్
- స్కిల్, ఫైబర్ గ్రిడ్ పిటిషన్లను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం బెంచ్
- అక్టోబర్ 17వ తేదీన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
- నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ పిటిషన్‌పై విచారణ చేస్తామని చెబుతూ.. అంతకు ముందే స్కిల్ కేసు తీర్పు వెల్లడిస్తామన్న బెంచ్
- దసరా, దీపావళి సెలవుల దృష్ట్యా విచారణ వాయిదా
- అక్టోబర్ 31వ తేదీన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మీద బయటకు
- మొత్తం 52 రోజులపాటు జైల్లో చంద్రబాబు.. మధ్యలో సీఐడీ కస్టడీ విచారణ
- నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
- అదే తేదీన పలు షరతులతో బాబుకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
- ఇవాళ వెలువడ్డ రెండు తీర్పులు
Comments
Please login to add a commentAdd a comment