సాక్షి, ముంబై: రాష్ట్ర విధాన పరిషత్‌లో సంఖ్యాబలం దృష్ట్యా ప్రతిపక్ష నేత పదవి తమకే దక్కాలంటూ ఒకపక్క శివసేన డిమాండ్ చేస్తుంటే మరోపక్క ఆ పదవి తమకే కావాలంటూ కాంగ్రెస్ కూడా పట్టుబడుతోంది. దీంతో ఈ పదవిపై చట్టపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కీలకమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరాత్ త్వరలో శివసేన, ఎన్సీపీ నేతలతో చర్చిస్తారని ఇరు పార్టీల నేతలు తెలిపారు. శివసేన నేత ఏక్‌నాథ్ శిండే 40 మందికిపైగా ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమా ణ స్వీకారం చేశారు. దీంతో మహావికాస్ ఆఘాడి ప్రతిపక్షానికే పరిమితమైంది.
ఆ తరువాత రెండు రోజులపాటు జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో శివసేన విధాన్ పరిషత్‌లో తమ పైచేయి చాటుకునేందుకు ప్రతిపక్ష నేత పదవిపై కన్నెసింది. ముఖ్యంగా విధాన పరిషత్‌లో కాంగ్రెస్, ఎన్సీపీతో పోలిస్తే శివ సేనకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది. దీంతో ప్రతిపక్ష నేత పదవి కోసం పట్టుబట్టేందుకు శివసేనకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఇరు పార్టీల కంటే శివసేనకు 13 మంది ఎమ్మెల్సీల సంఖ్యా బ లం ఎక్కువ ఉంది. దీంతో విధాన్ పరిషత్‌లో ప్రతిపక్ష నేత పదవి తమకే దక్కాలని శివసేన డిమాండ్ చేస్తోంది. కానీ ఆ పదవిపై కాంగ్రెస్ కూడా కన్నేయడంతో మహావికాస్ ఆఘాడి నేతల మధ్య విభేదాలు పొడచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చదవండి: ఉద్ధవ్ ఠాక్రేకు దెబ్బమీద దెబ్బ.. శివసేనకు కదం ‘రాంరాం’
ఇదిలాఉండగా ఇదివరకు ఒక్కటిగా ఉన్న శివసేన పార్టీ ఏక్‌నాథ్ శిండే తిరుగుబాటు చేయడంతో రెండుగా చీలిపోయింది. దీంతో శివసేనకు చెందిన ఏక్‌నాథ్ శిండే ముఖ్యమంత్రి పదవిలో, విధాన్ పరిషత్‌లో ప్రతిపక్ష నేత పదవిలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత కూర్చోవడం కొంత అసహనంగా మారనుంది. అంతేగాకుండా అధికారంలో శివసేన, ప్రతిపక్షంలో శివసేన అనే ధోరణిగా మారనుంది. దీంతో కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు నానా పటోలే ప్రతిపక్ష నేత పదవి కాంగ్రెస్‌కే దక్కాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనిపై శివసేన ఎలా స్పందిస్తుంది..? నానా పటోలే ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారనే దానిపై అందరూ దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment