సాక్షి, చంఢీగడ్: పంజాబ్ కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ ఎన్నికల్లో సీఎం స్థానం కోసం పోటీ పడి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ భంగపాటుకు గురయ్యారు. తీవ్ర ఉత్కంఠ మధ్య చరణ్‌జిత్ సింగ్ చన్నీనే సీఎం క్యాండిడేట్ గా పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో చన్నీ, సిద్దూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
చదవండి: వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం!
ఇదిలా ఉండగా శుక్రవారం అమత్ సర్(ఈస్ట్)లో ప్రచారంలో పాల్గొన్న సిద్దూ కూతురు రబియా సిద్దూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోబోనని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం అభ్యర్థి చన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చన్నీ అవినీతికి పాల్పడ్డారంటూ.. ఆయన బ్యాంకు ఖాతాను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బ్యాంకు అకౌంట్‌లో రూ.133 కోట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు.
నిజంగా చన్నీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే ఆయన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందని ఆరోపించారు. తన తండ్రి సిద్దూ 14 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశారని తెలిపారు. పంజాబ్‌ను న్యూ మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దడంలో సిద్దూ పాత్ర ప్రముఖంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో సిద్దూ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక‍్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment