సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. ఈ మేరకు అభ్యర్థుల పేర్లను టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ఈ జాబితాను ఆదివారం విడుదల చేయనున్నారు. మరోవైపు నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 16న ముగియనుంది. దీంతో ఎంపికైన అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేస్తారు. ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం పదిమంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రాలపై వారి పేర్లను ప్రతిపాదిస్తూ సంతకాలు చేసేందుకు అందుబాటులో ఉండాల్సిందిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో నియోజకవర్గాల్లో ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు శాసనమండలి స్థానికసంస్థల కోటాలో ఖాళీ అవుతున్న 12 సీట్లకు వచ్చేనెల 10న పోలింగ్ జరగనుంది. ఈ నెల 16 నుంచి 23 వరకు స్థానికసంస్థల కోటా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుండగా, ఈ నెల 22న టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న గవర్నర్ కోటాస్థానానికి ఈ ఏడాది ఆగస్టు 2న పాడి కౌశిక్‌రెడ్డి పేరును ప్రతిపాదించినా పోలీసు కేసులను కారణాలుగా చూపుతూ గవర్నర్ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే కేబినెట్ భేటీలో కౌశిక్ స్థానంలో మరొకరి పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది.
ఎమ్మెల్యే కోటా కసరత్తు కొలిక్కి...
119 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 103 మంది సభ్యుల బలం ఉంది. పార్టీ మిత్రపక్షం ఎంఐఎంకు కూడా ఏడుగురు సభ్యులు ఉండటంతో 110 మంది ఎమ్మెల్యేల మద్దతుతో టీఆర్‌ఎస్ ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా ఎమ్మెల్సీల లెక్కలను వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కోటా ఆరుస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు కూడా పరిశీలించినా, వచ్చే సాధారణ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఆయనను పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తే మాజీ ఎంపీ సీతారాం నాయక్, గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్ ఆశావహులుగా ఉన్నారు. ప్రస్తుతం మండలిలో మంత్రి సత్యవతి రాథోడ్ ఒక్కరే ఎస్టీ సామాజికవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
బీసీ సామాజికవర్గానికి ప్రాధాన్యత
బీసీ సామాజిక వర్గానికి రెండు లేదా మూడు స్థానాలను ఇవ్వాలనే ఉద్దేశంతో ఎల్.రమణ, మధుసూదనాచారితోపాటు మరో ఐదు పేర్లు ప్రధానంగా పరిశీలించినట్లు తెలిసింది. మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ విప్ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ జాబితాలో ఉన్నారు. మండలి పట్టభద్రుల ఎన్నిక సమయంలో హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్ స్థానం నుంచి అవకాశం ఆశించిన పీఎల్ శ్రీనివాస్ పేరు కూడా బీసీ కోటాలో పరిశీలనలో ఉంది. నేతి విద్యాసాగర్, ఆకుల లలిత పదవీకాలం పూర్తి కావడంతో మున్నూరుకాపు సామాజికవర్గానికి శాసనమండలిలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలిత, పీఎల్ శ్రీనివాస్‌లో ఒకరికి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. వెలమ సామాజికవర్గం నుంచి తక్కళ్లపల్లి రవీందర్‌రావు పేరు దాదాపు ఖాయం కాగా, రెడ్డి సామాజికవర్గంలో ఇద్దరికి అవకాశం దక్కనుంది. గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డి స్థానంలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నామినేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎంసీ కోటిరెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆశావహుల జాబితాలో ఉండగా, ఇద్దరికి అవకాశం దక్కనుంది.
22న స్థానిక సంస్థల కోటా జాబితా
శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో 12 సీట్లకుగాను ఈ నెల 16 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించాల్సి ఉండగా, ఈ నెల 22న అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌తోపాటు రెండేసి స్థానాలున్న కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సిట్టింగ్ ఎమ్మెల్సీల్లో ఒకరిద్దరికి మళ్లీ అవకాశం దక్కడం అనుమానమే. భానుప్రసాద్ (కరీంనగర్), పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్) తిరిగి స్థానిక సంస్థల కోటాలో పోటీకి విముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేందర్‌రెడ్డి, భానుప్రసాద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతుండగా, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఎమ్మెల్యే కోటా అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపుతున్నారు. ఆయన స్థానంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్), శంభీపూర్ రాజు (రంగారెడ్డి), వి.భూపాల్‌రెడ్డి (మెదక్) పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment