టీడీపీ-జనసేన శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ | Skill Scam Case: Supreme Court Likely To Pronounce Verdict On Jan 16th | Sakshi
Sakshi News home page

టీడీపీ-జనసేన శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ

Published Mon, Jan 15 2024 11:33 AM | Last Updated on Fri, Feb 2 2024 6:37 PM

Skill Scam Case: Supreme Court Likely To Pronounce Verdict Jan 16th - Sakshi

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాల్లో రోజుకో మలుపు చోటుచేసుకుంటోంది. ఇక పొత్తులో ఉన్న టీడీపీ జనసేన శ్రేణులు రేపటి కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో..  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై మంగళవారం జడ్జిమెంట్‌ రానుంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం మధ్యాహ్నాం తీర్పు వెల్లడించనుంది. 

స్కిల్‌ స్కామ్‌లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 16న(రేపు) తీర్పు వెలువరించనుంది. ఈ క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన తర్వాతే.. ఫైబర్‌నెట్‌ కేసు పిటిషన్‌ విచారణ చేపడతామని బెంచ్‌ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు కూడా పెండింగ్‌లో ఉంది. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానుంది. దీంతో.. ఈలోపే 17-ఏ పిటిషన్‌పై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనుంది. 

అంత త్వరగా క్వాష్‌ కోరడమా?
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరిట కుట్రపూరితంగా భారీ అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేసింది నేర పరిశోధన విభాగం(CID). ఈ కేసులో సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసింది. విజయవాడలోని అవినీతి నిరోధక న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) కోర్టులో ప్రవేశపెట్టాగా.. జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించిన కోర్టు పలుమార్లు పొడిగించుకుంటూ వెళ్లింది. చివరకు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్‌లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి కంటి సర్జరీ, చికిత్స లాంటి కారణాల విజ్ఞప్తి దృష్ట్యా..  మానవతా దృక్ఫథంతో హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆపై.. హైకోర్టులోనే రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు అయ్యింది. 

అయితే.. ఈ మధ్యలో స్కిల్‌ కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ, జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి పిటిషన్‌ కొట్టేయడంతో బాబుకు ఉన్నతన్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆ వెంటనే చంద్రబాబు ఆలస్యం చేయకుండా వెంటనే సుప్రీం కోర్టులో తన లాయర్లతో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయించారు. తన అరెస్ట్‌ అక్రమమని, సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌ ద్వారా సుప్రీంను అభ్యర్థించారాయన. అక్కడ సుదీర్ఘమైన వాదనలే జరిగాయి.

ఇదీ చదవండి: స్కిల్‌ స్కాం.. అంతా బాబుగారి కనికట్టు

చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ(అరెస్టుకు గవర్నర్‌ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, అభిషేక్‌ మను సింఘ్వీలు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారు వాళ్లంతా. అయితే.. స్కిల్‌ స్కామ్‌ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్‌ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్‌ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్‌ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్‌ చేసిన ఐదు రోజులకే క్వాష్‌ పిటిషన్‌ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్‌ దశలో ఉన్నప్పుడు సెక్షన్‌ 482 ద్వారా క్వాష్‌ కోరడం సరికాదని సీఐడీ తరఫున వాదించారు . 

క్వాష్‌ పిటిషన్‌..  ఎప్పుడేం జరిగిందంటే..

  • సెప్టెంబర్‌ 9వ తేదీన ఉదయం నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్‌
  • రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టు.. ఆపై ఐదుసార్లు రిమాండ్‌ పొడిగింపు
  • రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో స్నేహా బ్లాక్‌లో ఖైదీ నంబర్‌ 7691గా చంద్రబాబు 
  • ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌
  • సెప్టెంబర్‌ 13వ తేదీ విచారణకు స్వీకరించిన హైకోర్టు
  • సెప్టెంబర్‌ 19వ తేదీన వాదనలు వినిపించిన బాబు లాయర్లు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా..  సీఐడీ తరఫున వాదించిన ముకుల్‌ రోహత్గీ 
  • సెప్టెంబర్‌ 22వ తేదీన.. స్కిల్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు
  • క్వాష్‌పై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ..  సెప్టెంబర్‌ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌  
  • సెప్టెంబర్‌ 25వ తేదీన చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందుకు బాబు క్వాష్‌ పిటిషన్‌.. మర్నాడు మెన్షన్‌ చేయాలన్న సీజేఐ
  • 26న సంబంధిత న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ఉన్నందున మరుసటి రోజుకి వాయిదా
  •  జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ల ధర్మాసనం ముందుకు సెప్టెంబర్‌ 27వ తేదీన బాబు క్వాష్‌ పిటిషన్‌ 
  • ట్విస్ట్‌ ఇస్తూ.. ధర్మాసనం నుంచి వైదొలగిన జస్టిస్‌ భట్‌
  • మరోసారి సీజేఐ చంద్రచూడ్‌ ముందుకు అత్యవసరంగా తీసుకెళ్లిన బాబు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా
  • అక్టోబర్‌ 3వ తేదీకి చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ వాయిదా 
  • అక్టోబర్‌ 3వ తేదీన జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు పిటిషన్‌
  • అక్టోబర్‌ 9,10,13వ తేదీల్లో వాడీవేడిగా సాగిన వాదనలు
  • అక్టోబర్‌ 13వ స్కిల్‌ పిటిషన్‌కు తోడైన ఫైబర్‌ గ్రిడ్‌ కేసు పిటిషన్‌
  • స్కిల్‌, ఫైబర్‌ గ్రిడ్‌ పిటిషన్లను అక్టోబర్‌ 17వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం బెంచ్‌ 
  • అక్టోబర్‌ 17వ తేదీన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీం బెంచ్‌
  • నవంబర్‌ 9వ తేదీన ఫైబర్‌ గ్రిడ్‌ పిటిషన్‌పై విచారణ చేస్తామని చెబుతూ.. అంతకు ముందే స్కిల్‌ కేసు తీర్పు వెల్లడిస్తామని 
  • దసరా, దీపావళి సెలవుల దృష్ట్యా  విచారణ వాయిదా
  • అక్టోబర్‌ 31వ తేదీన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మీద బయటకు
  • మొత్తం 52 రోజులపాటు జైల్లో చంద్రబాబు.. మధ్యలో సీఐడీ కస్టడీ విచారణ
  • నవంబర్‌ 20వ తేదీన క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీం బెంచ్‌
  • అదే తేదీన పలు షరతులతో బాబుకి రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చిన ఏపీ హైకోర్టు
  • శీతాకాల సెలవుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన స్కిల్‌ కేసు తీర్పు
  • ఎట్టకేలకు ఈనెల 16న వెలువడనున్న తీర్పు

 జరిగింది ఇదే.. 
టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకో­ణం కేసు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్‌వాయిస్‌లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు­నాయుడే ప్రధా­న సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.

కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడి ఉన్నారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement