సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చేసిన అవినీతి, అక్రమాలు వెలుగులోకి రాకుండా పక్కదారి పట్టించడానికే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు భాషకు అనుగుణంగా రాయాలనే తాపత్రయమే తప్ప పోలవరంపై రాధాకృష్ణకు ఏ విధమైన అవగాహన లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.5 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు పనిని రూ.30 కోట్లకు పెంచి, దానిని యనమల రామకృష్ణు్ణడు వియ్యంకుడికి కాంట్రాక్టు అప్పగించారని.. అలాంటివి 15 పనుల దాకా జరిగాయని ఆయన ఆరోపించారు. భూసేకరణలోనూ అవినీతి జరిగిందన్నారు. అంతకు ముందు రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భూసేకరణలో డబ్బులు చెల్లించిన భూముల నంబర్లనే మరోసారి చూపించి టీడీపీ నేతలు డబ్బులు కొట్టేశారని చెప్పారు. ప్రభుత్వ భూములను కూడా తమవిగా చూపించి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. సోము వీర్రాజు ఇంకా ఏమన్నారంటే..
దారుణమైన రాతలు, కూతలు
– భూసేకరణలో విస్తీర్ణాన్ని పెంచారు. మళ్లీ వచ్చేస్తామనుకున్నారు. తినేద్దామనుకున్నారు. ఈ కారణాలతోనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు అంచనా రూ.28 వేల కోట్ల నుంచి ఇప్పుడు రూ.48 వేల కోట్లకు పెరిగింది.
– ఈ అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతుండడంతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అర్థ రహితమైన కథనాలు రాస్తున్నారు. ఎంతటి దారుణమైన రాతలు, కూతలివి? విభజన సమయంలో ఆ ఏడు మండలాల గురించి ఒక్క కథనం కూడా రాయని రాధాకృష్ణ.. ఇప్పుడు వాటి గురించి ఎందుకు చర్చ లేవనెత్తున్నారు?
– రాధాకృష్ణ ఏమన్నా కేసీఆర్‌కు తాబేదారా? రాధాకృష్ణకు భద్రాచలం ఎవరిదో తెలియదు.. ఏడు మండలాలు ఎవరివో తెలియదు. కేసీఆర్ ఇప్పుడు గొడవ చేస్తాడంటాడేమిటి? దమ్ముంటే ఏడు మండలాలు పోను భద్రాచలంలోని మిగిలిన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపించు.
– పోలవరంలో అవినీతికి పాల్పడిన వాళ్లను ఏదో ఒక విధంగా కాపాడాలని రాధాకృష్ణ రాస్తున్న రాతలను బీజేపీ క్షమించదు. పోలవరంపై చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం. చంద్రబాబు పోలవరం కట్టకుండా ఉండాలని రెండు ఎత్తిపోతల పథకాలు కట్టారు. పోలవరాన్ని రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఎత్తు తగ్గించకుండానే బీజేపీ దానిని పూర్తి చేస్తుంది.
– తుంగభద్ర పుష్కరాల్లో భక్తులను స్నానాలకు అనుమతించాలి. టైం స్లాట్ నిర్ణయించి, రద్దీని నియంత్రించాలి. సమావేశంలో బీజేపీ నేతలు యడ్లపాటి రఘునాథ్‌బాబు, సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment