పొలిటీకల్‌ ఎంట్రీ: గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు | Sourav Ganguly Comments On His Political Entry | Sakshi
Sakshi News home page

పొలిటీకల్‌ ఎంట్రీ: గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Mar 8 2021 8:42 PM | Updated on Mar 8 2021 10:03 PM

Sourav Ganguly Comments On His Political Entry - Sakshi

జీవితం ఎటు పోతుందో.. ఏం జరుగుతుందో చూడాలి

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఈ ఏడాది జనవరిలో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు రెండు ఆంజియోప్లాస్ట్‌ సర్జరీలు చేశారు వైద్యులు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇక దాదా భవిష్యత్‌ ప్రణాళికలు ఏంటనే దానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలో గంగూలీ స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదా రాజకీయ రంగం ప్రవేశం గురించి చర్చ నడుస్తోంది.

గంగూలీని తమతో కలుపుకునేందుకు అటు టీఎంసీ.. ఇటు బీజేపీ రెండు పోటీ పడుతున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ.. కొద్ది రోజుల క్రితం ఇరు పార్టీల నాయకులు గంగూలీని కలిశారనే వార్తలు వచ్చాయి. కానీ దాదా వీటిని ఖండించారు. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియా గంగూలీ భవిష్యత్‌ ప్రణాళిక ఏంటని ప్రశ్నించింది. దీనిపై స్పందిస్తూ.. ‘‘జీవితం ఎటు పోతుందో.. ఏం జరుగుతుందో’’ చూడాలి అంటూ బదులిచ్చారు దాదా. 

దేశవ్యాప్తంగా తనకున్న పాపులారిటీపై స్పందిస్తూ గంగూలీ.. ‘‘అదృష్టం కొద్ది నాకు చాలా మంది ప్రేమాభిమానాలు లభించాయి. నేనిది ఊహించలేదు. నా పని నేను చేశాను. కోల్‌కతాలో నేను సాధారణ జీవితం గడిపాను. ప్రజలను కలవడం.. వారితో మాట్లాడటం.. వారితో సమయం గడపటం నా నైజం. నేనలాగే ఉంటాను’’ అన్నారు.

అలానే ‘‘నేను చాలా స్నేహపూర్వకంగా ఉంటాను. కాకపోతే ఎవరితోనూ ఎక్కువ సేపు గడపలేను. నేను చాలా ఫేమస్‌ కాబట్టి.. జనాలు నన్ను కలవాలంటే కష్టం అనే మాటలను నేను నమ్మను. నా జీవితం నేను గడుపుతున్నాను.. అందువల్లే ప్రజలు నన్ను ఇష్టపడుతున్నారని భావిస్తాను’’ అన్నారు. 

చదవండి:
దాదా భేటీపై రాజకీయ దుమారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement