సాక్షి, అమరావతి : ఉదయం కొద్దిసేపు టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్ద ఈలలు, నినాదాలతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తప్పితే శుక్రవారం శాసన మండలి కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాయి. దాదాపు గంటన్నర పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ప్రశ్నోత్తరాలలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, గిరిజనుల సంక్షేమం, ధాన్యం కొనుగోళ్లు తదితర ప్రశ్నలపై చర్చలో పలువురు అధికార పార్టీ సభ్యులతోపాటు ప్రతిపక్ష పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
వివిధ ప్రజా సంబంధ అంశాలపై పలువురు ఎమ్మెల్సీలు ‘స్పెషల్ మెన్షన్’ కింద మండలి చైర్మన్ మోషేన్‌రాజుకు విజ్ఞాపన పత్రాలు అందించారు. ‘రాష్ట్రంలో వ్యవసాయ రంగం పురోగతి – రాష్ట్ర ప్రభుత్వ చర్యలు’ అంశంపై రెండు గంటలపాటు స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో వివిధ పార్టీల సభ్యుల ప్రసంగాల అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమాధానమిచ్చారు.
వారంతట వారుగా సభ నుంచి వెళ్లిపోయిన టీడీపీ ఎమ్మెల్సీలు
చంద్రబాబుపై పెట్టిన కేసులపై చర్చించాలంటూ టీడీపీ, ‘జాబ్‌క్యాలెండర్’పై చర్చ కోరుతూ పీడీఎఫ్ సభ్యులు రెండు వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే ఆ రెండింటినీ తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. ఆ వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు కోరుతున్న అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మండలి కార్యక్రమాల అజెండాలోనూ ఉందని చైర్మన్ వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు.
ఇదే అంశంపై చర్చించాలని బీఏసీలోనూ నిర్ణయించినందున టీడీపీ ఎమ్మెల్సీలు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి అంబటి రాంబాబు కూడా సూచించారు. అయినా టీడీపీ ఎమ్మెల్సీలు వినకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక టీడీపీ ఎమ్మెల్సీలు మరోసారి పోడియం పైకి వచ్చేందుకు ప్రయత్నించారు. మండలి చైర్మన్ మోషేన్‌రాజు మార్షల్స్‌ను పిలిపించి వారు పోడియం వద్దకు రాకుండా నిలువరించారు.
టీడీపీ సభ్యులు మార్షల్స్‌ను నెడుతూ, విజిల్స్ వేస్తూ అల్లరి చేశారు. దీంతో మంత్రి సురేష్ చేసిన ప్రతిపాదన మేరకు టీడీపీ సభ్యులు కంచర్ల శ్రీకాంత్‌ను ఈ సమావేశాలు జరిగే అన్ని రోజులు, బీటీ నాయుడు, పంచుమర్తి అనురాధను శుక్రవారం ఒక్క రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. వారిని మార్షల్స్ బయటకు తరలించారు. అనంతరం మిగిలిన టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసే ప్రయత్నం చేశారు. వారి నుంచి ప్లకార్డులు స్వా«దీనం చేసుకోవాలని చైర్మన్ మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో ఆ టీడీపీ ఎమ్మెల్సీలు కూడా వారంతట వారే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
కొత్తగా వచ్చారు.. రౌడీయిజంతో ప్రవర్తించడం వల్లే..– మండలి చైర్మన్
ఈ సభ చరిత్రలోనే ఎప్పడూ లేని విధంగా సభ్యులను సస్పెండ్ చేయాల్సి రావడం తీవ్ర విచారకర సంఘటన అని చైర్మన్ మోషేన్‌రాజు అన్నారు. సస్పెండ్ అయిన సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘చాలా దురదృష్టకరం. మీరు కొత్తగా వచ్చిన సభ్యులు. సభా సంప్రదాయాలను తెలుసుకోవాలి. చైర్మన్ స్థానానికి, ఇతర సభ్యులకు గౌరవం ఇవ్వాలి. అది తెలుసుకోకుండా ఏదో రౌడీయిజంగా ప్రవర్తించడం చాలా విచారించదగ్గ అంశం’ అని మోషేన్‌రాజు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment