సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. అధిష్టానానికి నివేదిక సమర్పించేందుకు ఇంకా సమయముందన్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియపై ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రా రంభించి ఇప్పటివరకు 18 కేటగిరీల్లోని రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు 162 మంది నేతల అభిప్రాయాల ను సేకరించాం.. అయితే ఈ కసరత్తు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది. రాష్ట్రం లో సేకరించిన అభిప్రాయాల ఆధారంగా నివేదికను సిద్ధం చేసి సోనియా, రాహుల్ గాంధీలకు అందిస్తాం. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అందరి అభిప్రాయాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది..’అని చెప్పారు.
పీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తుపై రాష్ట్ర నాయకులకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే, పార్టీ అధిష్టానాన్ని నేరుగా కలిసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాణిక్యం ఠాగూర్ అన్నారు. ‘క్షేత్రస్థాయిలో ఏమాత్రం ప్రజాదరణ లేని నాయకులే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నారు. సంస్థాగతమైన లోపాల కారణంగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి బలహీనంగానే ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అవుతారని మేం ముందుగా చెప్పినట్లే జరిగింది. ఢిల్లీలో దోస్తీ.. గల్లీ మే కుస్తీ అన్నట్టుగా టీఆర్‌ఎస్–బీజేపీల వ్యవహారశైలి ఉంది.’ అని మాణిక్యం వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment