Manikrao Thakre Replaces Manickam Tagore As AICC Incharge In Telangana - Sakshi
Sakshi News home page

‘రేవంత్‌’ వేదాంతం..

Published Thu, Jan 5 2023 3:33 AM | Last Updated on Thu, Jan 5 2023 10:14 AM

Manikrao Thakre replaces Manickam Tagore as AICC incharge in Telangana - Sakshi

సాక్షి,హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించి బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను అధిష్టానం తప్పించింది. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ నేత మాణిక్‌రావ్‌ ఠాక్రేను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మాణిక్యం ఠాగూర్‌కు గోవా రాష్ట్ర వ్యవహారాలను అప్పగించారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాష్ట్రంలోని సీనియర్‌ నేతల ఒత్తిడితో పాటు, పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగేందుకు మాణిక్యం సైతం విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో అధిష్టానం ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మాణిక్యంను తప్పిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు వెలువడడానికి కొద్దిగా ముందు, టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్‌రెడ్డి వేదాంత ధోరణిలో మాట్లాడడం పార్టీలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

‘రేవంత్‌’ వేదాంతం..
పదవిలో ఉన్నా లేకున్నా పార్టీకి కట్టుబడి పనిచేస్తా. అధ్యక్షుడిగా వేరేవారిని నియమించినా భుజాలపై మోస్తా. పార్టీ కోసం పదవులను, అవసరమైతే ప్రాణాలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధం. అందరూ మానవమాత్రులే. అప్పుడప్పుడూ పొరపాట్లు జరుగుతాయి. వాటిని సరిదిద్దుకుంటాం.  

సీనియర్లు లేని శిక్షణ
‘హాథ్‌సే హాత్‌జోడో’ పాదయాత్రల గురించి చర్చించడంతో పాటు ధరణి పోర్టల్‌పై నేతలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు సీనియర్లు డుమ్మా కొట్టారు. ఏఐసీసీ సమన్వయకర్త గిరీష్‌ జోడంకర్‌ హాజరైన భేటీకి సీనియర్లు గైర్హాజరవడం చర్చనీయాంశమయింది.    

ఏఐసీసీ సమన్వయకర్త గిరీష్‌ జోడంకర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఈ భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి తదితరులు హాజరు కాగా.. కారణాలేవైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు లాంటి నాయకులు పాల్గొనకపోవడం చర్చనీయాంశమవుతోంది.  

పలు అంశాలపై టీపీసీసీ చర్చ 
బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా జనవరి 26 నుంచి నిర్వహించాల్సిన ‘హాత్‌సే హాత్‌జోడో’ పాదయాత్రల గురించి నేతలు చర్చించారు. ధరణి పోర్టల్‌పై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నేతలకు అవగాహన కల్పించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన పక్షంలో బీమా కల్పన, మీడియాతో సమన్వయం, ఎన్నికల నిబంధనలు తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది.

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మల్లురవి, గాలి అనిల్‌కుమార్, సంపత్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి, చిన్నారెడ్డి, అంజ¯న్‌కుమార్‌ యాదవ్, హర్కర వేణుగోపాల్, రాములు నాయక్, నిరంజన్‌లతో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), టీపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, పీసీసీ ప్రతిని«ధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.  

కేసీఆర్‌ ఏ గట్టునుంటారో చెప్పండి: రేవంత్‌ 
ఈ సమావేశాన్ని రేవంత్‌రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరణ ద్వారా ప్రారంభించారు. సమావేశం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన వివాదాల విషయంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఏ గట్టునుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. ‘గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్‌ ఎటువైపు ? ఆస్తుల విభజనలో తెలంగాణ వైపా, ఆంధ్రప్రదేశ వైపా?’ అని ప్రశ్నించారు. ఎన్నో త్యాగాలు చేసి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తే ఆ గట్టున చేరిన కేసీఆర్‌ తెలంగాణను ముంచాలనుకుంటున్నాడని విమర్శించారు. రెండుసార్లు ప్రజలు అధికారమిచి్చనా కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని, కేసీఆర్‌ పాలనలో దగా పడని వర్గం లేదని అన్నారు.  

కేసీఆర్‌ కుటుంబాన్ని ఉప్పెనలా కప్పేద్దాం 
కాంగ్రెస్‌ కార్యకర్తలంతా కార్యోన్ముఖులై కదలాలని, ఉప్పెనలా కేసీఆర్‌ కుటుంబాన్ని కప్పేద్దామని రేవంత్‌ పిలుపునిచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా తాను పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తానని, పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధమని అన్నారు. పార్టీ ఏ ఆదేశాలిచ్చినా సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ కుటుంబానికి జానారెడ్డి పెద్దదిక్కులాంటి వారని, ఆయన సూచనల ప్రకారం నడుచుకుని పార్టీని రాష్ట్రంలోని అన్ని మూలలకు తీసుకెళ్దామని చెప్పారు. కొన్ని దుష్టశక్తులు ఆశించినట్టుగా తెలంగాణ సమాజానికి నష్టం చేయబోమని కాంగ్రెస్‌ శ్రేణులు నిరూపించారని, తెలంగాణ ప్రజలకు నష్టం కలిగేలా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించబోదని ఈ వేదిక నుంచి సందేశం ఇద్దామని అన్నారు.  

ఐక్యంగా పనిచేస్తే అధికారం: జోడంకర్‌ 
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా హాత్‌సే హాత్‌జోడో యాత్రలు చేయాలని గిరీష్‌ జోడంకర్‌ పిలుపునిచ్చారు. ఈ యాత్రలను ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకోవాలని, హాత్‌సే హాత్‌జోడో యాత్రల విజయవంతం కోసం ఈనెల 8వ తేదీన జిల్లా, మండల, బూత్‌ స్థాయి సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. పార్టీ నేతల మధ్య సమన్వయానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయన్నారు. నేతలందరూ ఐక్యంగా పనిచేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ పారీ్టదే అధికారమని వ్యాఖ్యానించారు.  

వైఎస్సార్‌ పాదయాత్ర ఓ చరిత్ర 
అంతకుముందు సమావేశం ప్రారంభం సందర్భంగా సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర కాంగ్రెస్‌ పారీ్టదని, దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టేందుకే రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ చేపట్టిన పాదయాత్ర ఓ చరిత్రగా నిలిచి పోయిందని, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ యాత్ర తోడ్పడిందని తెలిపారు. వైఎస్సార్‌ స్ఫూర్తితో తెలంగాణలో పాదయాత్రలు చేద్దామని రేవంత్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హాత్‌సే హాత్‌జోడో యాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రతి గడపను తట్టి రాహుల్‌గాంధీ ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పారు.   

కేడర్‌ను ఉత్తేజితుల్ని చేయండి 
టీపీసీసీ సమావేశానంతరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులతో ఏఐసీసీ నియమించిన హాత్‌సే హాత్‌జోడో అభియాన్‌ సమన్వయకర్త గిరీష్‌ జోడంకర్, రేవంత్‌రెడ్డిలు సమావేశమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కేడర్‌ను ఉత్తేజితులను చేయాలని, జనవరి 26 నుంచి జరగనున్న పాదయాత్రలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అదే విధంగా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా స్థానిక ప్రజలెదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చార్జిషీట్లు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారం దక్కించుకునే దిశలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  

మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా..మంత్రిగా.. 
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మాణిక్‌రావు ఠాక్రే 2008 నుంచి 2015 వరకు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1985 నుంచి 2004 మధ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, 2009 నుంచి 2018 మధ్య ఎమ్మెల్సీగా పని చేశారు. శరద్‌ పవార్, విలాస్‌ రావు దేశ్‌ ముఖ్, సుశీల్‌ కుమార్‌ షిండేల మంత్రి వర్గాల్లో మూడుసార్లు వివిధ శాఖల మంత్రిగా సేవలందించారు. మంత్రిగా పరిపాలన అనుభవంతో పాటు దాదాపు ఎనిమిదేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం మాణిక్‌రావ్‌ ఠాక్రేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement