వాహన తనిఖీ చేస్తున్న పోలీసులు
సాక్షి, చెన్నై: శుభముహూర్తం కావడంతో సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి. సీఎం పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత దినకరన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక సోమవారం ముహూర్తం బాగుండడంతో నేతలందరూ నామినేషన్ల దాఖలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో కొన్ని సీట్లు మినహా మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఎడపాడిలో పళనిస్వామి, కొళత్తూరులో స్టాలిన్, కోయంబత్తూరు దక్షిణంలో కమలహాసన్, కోవిల్ పట్టిలో దినకరన్, తిరువొత్తియూరులో సీమాన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అనంతరం ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. మంత్రులు, ముఖ్య నేతలంతా ఇదే రోజు నామినేషన్లు దాఖలు చేయనుండడంతో ఆయా కార్యాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో అభ్యరి్థతో పాటుగా మరొకరిని మాత్రమే రిటరి్నంగ్ అధికారుల వద్దకు అనుమతించనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఇప్పటి వరకు రూ. 100 కోట్లు స్వాధీనం
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న తనిఖీల్లో శనివారం నాటికి రూ. 100 కోట్ల నగదు, నగలు, వస్తువులు పట్టుబడినట్లు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. శని, ఆదివారాల్లోనూ పెద్దఎత్తున పట్టుబడిన నగదు, వస్తువుల వివరాలను సోమవారం ప్రకటించనున్నారు. ఆదివారం ఆవడిలో పాత సామాన్ల వ్యాపారి శరవణన్ ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 17 లక్షలు పట్టుబడింది. అలాగే తిరుప్పూర్‌లో మంత్రి ఉడములై రాధాకృష్ణన్ ముఖ చిత్రంతో వాచీలు, చీరలు, దోవతీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక కోవిల్ పట్టిలో తనిఖీని అడ్డుకున్న మంత్రి కడంబూరు రాజుపై కేసు నమోదుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
మరక్కాణం, చెంగల్పట్టు, వేలూరులో సాగిన సోదాల్లో రూ. 1.97 కోట్ల విలువ చేసే నగదు, నగలు, మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. మన్నార్‌కుడిలో 64 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. తిరుపతి నుంచి పట్టుచీరలు కొనేందుకు వచ్చిన ఓ బృందం వద్ద రూ. 2.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్‌లో ఓ హెలికాఫ్టర్ దిగడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అందులో తనిఖీలు జరిపారు. అయితే ఆ హెలికాఫ్టర్‌లో కేరళకు చెందిన ప్రముఖ బంగారు వ్యాపారి కల్యాణ రామన్ తన కుటుంబంతో అంకాల పరమేశ్వరి ఆలయ దర్శనానికి వచ్చినట్టు విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment