కుప్పంలో కట్టెలతో టీడీపీ కార్యకర్తల స్వైర విహారం.. తన మీదకు టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరి భయభ్రాంతులకు గురిచేయడంతో కన్నీరు పెడుతున్న కుప్పం ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ నేత అశ్విని
సాక్షి, చిత్తూరు: ఇన్నేళ్లు మభ్యపెట్టి ఓట్లు దండుకుంటూ వచ్చిన చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గం ప్రజల్లో వచ్చిన చైతన్యం కంటగింపుగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టడంతో పాటు శ్రేణులు క్రమంగా పార్టీకి దూరమవుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఆయన ఏకంగా పార్టీ శ్రేణుల్ని భౌతిక దాడులకు ఉసిగొల్పుతున్నారు. బుధ, గురువారాల్లో ఆయన తన కార్యకర్తలను రెచ్చగొట్టిన తీరుచూస్తే.. నయానో భయానో నియోజకవర్గ ప్రజలను లొంగదీసుకోవాలన్నదే వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవైపు తన అనుచరులను రెచ్చగొడుతూనే.. మరోవైపు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలకు దిగుతున్నారు.
నిజానికి.. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం ఈ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోగా.. స్థానిక టీడీపీ నేతలు ప్రజలను అడ్డగోలుగా దోచుకున్నారు. దీంతో ఉపాధి లేని ప్రజలకు వలసలే దిక్కు అయ్యాయి. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో అభివృద్ధి ప్రారంభమైంది. కుప్పంను మున్సిపాలిటీగా ప్రకటించటంతో పాటు ప్రత్యేకంగా రూ.65 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం.. రెవెన్యూ డివిజన్‌గా మార్పుచేయడం చంద్రబాబు అసహనానికి కారణమైంది.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతుండటంతో నియోజకవర్గం నుంచి వలసలు పూర్తిగా నిలిచిపోయాయి. వాస్తవం బోధపడి టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీలోకి క్యూ కట్టాయి. దీంతో కుప్పం చేజారిపోతుందని అర్ధమయ్యే చంద్రబాబు ఇప్పుడు కల్లోలం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత రెండ్రోజుల్లో ఇక్కడ చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతుంది.
ఉనికి కోల్పోతామనే భయంతోనే అరాచకాలు
అసలు చంద్రబాబు హయాంలో కుప్పంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. అయితే, సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ మూడున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ప్రతిష్ట మసకబారింది. నానాటికీ దిగజారిపోతోంది. ప్రత్యేకించి స్థానిక ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో తన సీటుకే ఎసరు వచ్చే ప్రమాదాన్ని చంద్రబాబు గ్రహించారు. దీంతో కుప్పంలోనైనా తన ప్రాభవాన్ని నిలుపుకోవాలనే తాపత్రయంలో అరాచకాలకు తెరతీశారు. ప్రణాళికలు సిద్ధంచేసి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించి ఆ నెప్పాన్ని వైఎస్సార్‌సీపీపైకి మళ్లించే వ్యూహాన్ని రచించారు.
బాబు డైరెక్షన్‌లోనే అల్లర్లు
ఇక చంద్రబాబు బుధవారం రామకుప్పం మండలంలో ముందస్తు ప్రణాళికతోనే అల్లర్లకు తెరతీశారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులనేæ టార్గెట్‌గా చేసుకుని దాడులకు తెగబడ్డారు. వారి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. ఆఖరికి రెండేళ్ల చిన్నారిని కూడా గాయాలపాల్జేశారు. ఎప్పుడో ఏర్పాటుచేసుకున్న వైఎస్సార్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలను బూచిగా చూపించి రాజకీయంగా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. పైగా తమ వాళ్లపైనే వైఎస్సార్‌సీపీ దాడులు చేసిందంటూ ఎల్లో మీడియాలో విస్తృత ప్రచారం చేయించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలనే సంకేతాలను టీడీపీ కేడర్‌కు పంపారు.
ప్రాణభయంతో మహిళా ఎంపీపీ పరుగులు
అలాగే, చంద్రబాబు గురువారం కూడా కొత్త నాటకానికి తెరతీశారు. మీడియా దృష్టి కోసం బస్టాండ్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అన్న క్యాంటీన్ పేరుతో నానా రభస చేశారు. మీడియా ఫొటోసెషన్, వీడియో షూట్ తర్వాత కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ‘‘వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపైకి తానే వెళ్తాను.. వారి అంతుచూస్తాను’’.. అంటూ మాట్లాడడంతో తెలుగు తమ్ముళ్లు కర్రలతో కుప్పం వీధుల్లో స్వైరవిహారం చేశారు. విచక్షణా రహితంగా దాడులు చేస్తూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైకి దూసుకెళ్లారు.
అడ్డొచ్చిన పోలీసులపై కూడా కర్రలతో దాడిచేసేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగక.. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అశ్విని ఉన్న సమయంలోనే రాళ్లవర్షం కురిపించారు. దీంతో ఆమె ప్రాణభయంతో పరుగులు తీశారు. అయినప్పటికీ ఆమెనే లక్ష్యంగా చేసుకుని కర్రలు, రాళ్లు విసిరారు. మరోవైపు.. లక్ష్మీపురంలో వైఎస్సార్‌సీపీ నేత మణి ఇంటి వద్ద ఉన్న బ్యానర్లు, పార్టీ తోరణాలను టీడీపీ అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. ఒంటరిగా ఉన్న వారినీ వదిలిపెట్టలేదు. కుప్పం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ భరత్ ఇంటి వైపు అల్లరి మూకలు వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు.
వైఎస్సార్‌సీపీ ర్యాలీకీ అడ్డంకులు
టీడీపీ నేతలు, కార్యకర్తల చేతుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న భయ్యారెడ్డి, నారాయణరెడ్డితోపాటు మరికొందరి బాధితులకు సంఘీభావంగా గురువారం వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన శాంతియుత ర్యాలీకి కూడా టీడీపీ వర్గీయులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల సూచనతో వైఎస్సార్‌సీపీ నేతలు శాంతియుతంగా ర్యాలీ సాగించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద బైఠాయించి టీడీపీ దౌర్జన్యాలపై నిరసన తెలిపారు. టీడీపీ గూండాల చేతుల్లో గాయపడిన బాధితులను ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌లు పరామర్శించారు.
నేడు బాబు రోడ్‌షో.. మళ్లీ అల్లర్లకు కుట్ర?
తొలి రెండ్రోజుల తరహాలోనే మూడోరోజైన శుక్రవారం కూడా తీవ్రస్థాయిలో అల్లర్లు చేసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ వ్యూహం పన్నినట్లు.. ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ముందస్తు సమాచారంతో పోలీసులు బందోబస్తును పటిష్టం చేశారు. జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment