ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీ ఎన్నికల కోసం ‘సిద్ధం’ అవుతున్న వేళ ప్రతిపక్షాలు అభ్యర్థుల కోసం తంటాలు పడుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.
టీడీపీ-జనసేన కూటమికి చెందిన తొలి జాబితాను నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీలకు చెందిన సీనియర్ నేతలు కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. అయితే, అభ్యర్థుల జాబితాపై చంద్రబాబు, పవన్ ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే తొలి విడతలో 60-70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో టీడీపీకి 50, జనసేనకు 10 స్థానాలను కేటాయించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఎవరికి సీట్లు వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. టికెట్ రాని నేతలు.. ఆశావహులు ఏం చేయబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కలిపి ముందుకు సాగాలని చంద్రబాబు భావిస్తున్నా.. కాషాయ పార్టీ షరతులతో బాబుకు టెన్షన్ మొదలైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే ఎన్ని స్థానాల్లో టీడీపీ, జనసేన పోటీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారనుంది. ఇక, నేడు ప్రకటించనున్న స్థానాలను బీజేపీ అడిగితే పరిస్థితి ఏంటి? అనేది కూడా చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే పలు స్థానాల్లో టీడీపీ సీనియర్లకు టికెట్ లేదని చెప్పడంతో వారు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధనబలం, ఎన్‌ఆర్‌ఐలకు చంద్రబాబు సీట్లు ఆఫర్ చేస్తున్నారని పచ్చ బ్యాచ్ నేతలు ఫైరవుతున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ టికెట్‌ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించడంపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. టీడీపీ పదవులకు శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు రమేష్ రెడ్డి అనుచర వర్గం ప్రకటించింది. మరో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు కూడా రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో, టీడీపీ జెండాలను ,కరపత్రాలను లక్కిరెడ్డిపల్లి మూడు రోడ్ల కూడలిలో నిప్పు పెట్టి దగ్ధం చేశారు. చంద్రబాబు నాయుడు పోస్టర్ల పైన చెప్పులతో చితకబాదుతూ టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డబ్బుకు అమ్ముడుపోయిన చంద్రబాబు డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment